Site icon NTV Telugu

గిన్నిస్ బుక్ లోకి ఎక్కబోతున్న ‘మనసానమః’

దీపక్ దర్శకత్వంలో రూపుద్దిద్దుకున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మనసానమః’ 2022 ఆస్కార్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో క్వాలిఫై అయ్యింది. త్వరలో జరిగే ఓటింగ్ తో నామినేషన్ సైతం దక్కించుకుంటుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ‘మనసానమః’ లఘు చిత్రాన్ని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో మీడియాకు ప్రదర్శించారు. స్క్రీనింగ్ అనంతరం దర్శకుడు దీపక్ మాట్లాడుతూ, ”కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించాం. స్టోరీని రివర్స్ లో నెరేట్ చేయడం అనేది ఈ మూవీ ప్రత్యేకత. ఆ కాన్సెప్ట్ వ్యూవర్స్ తో పాటు ఫిల్మ్ పర్సనాలిటీస్ కూ బాగా నచ్చింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తన సమర్పణలో దీనిని తమిళంలో డబ్ చేశారు. అలానే ‘కేజీఎఫ్‌’ మూవీ కో-ప్రొడ్యూసర్స్ దీన్ని కన్నడలో అనువదించారు. మలయాళ డబ్బింగ్ వర్షన్ సైతం రెండీగా ఉంది. అయితే ఈ లోగా ఆస్కార్ కు మా షార్ట్ ఫిల్మ్ క్వాలిఫై కావడంతో వాయిదా వేశాం. ఇప్పటికే తొమ్మిది వందలకు పైగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ మూవీ వివిధ కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుంది. ఓ షార్ట్ ఫిల్మ్ కు ఇన్ని అవార్డులు రావడం అనేది గ్రేట్. త్వరలోనే మా మూవీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కించుకోబోతోంది. ఈ షార్ట్ ఫిల్మ్ కారణంగా ఓ ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలో ఫీచర్ ఫిల్మ్ చేసే ఛాన్స్ వచ్చింది” అని చెప్పారు.

హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ, ‘ఇందులో స్టోరీని నెరేట్ చేయడంతో పాటు నా గతంలో జరిగిన మూడు లవ్ స్టోరీస్ ను కూడా వివరించాలి. నిజానికి ఇది కాస్తంత ఇబ్బందికరమైన టాస్కే. అయితే దర్శకుడు దీపక్ కు క్లారిటీ ఉండటంతో నా పని సులువైంది. ఈ షార్ట్ ఫిల్మ్ విడుదలైన దగ్గర నుండి నన్ను సూర్య అనే చాలామంది సంభోదిస్తున్నారు” అని చెప్పారు.

‘మనసానమః’లో లో చైత్ర పాత్రను పోషించిన దీక్షికా చందర్ మాట్లాడుతూ, ”న్యూయార్క్ నుండి ఇండియా రాగానే నాకు ‘మనసానమః’లో నటించే ఛాన్స్ లభించింది. తెలుగు భాష రాకపోయినా నేర్చుకుని, వర్క్ షాప్ లో పాల్గొని ఈ పాత్ర చేశాను. సినిమా రంగానికి చెందిన ప్రముఖులు దీన్ని మెచ్చుకోవడం, ఇవాళ ఆస్కార్ కు క్వాలిఫై కావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది” అని తెలిపింది. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ రాజ్ ఎదురోలు, సంగీత దర్శకుడు కమ్రాన్ సైతం పాల్గొన్నారు.

Exit mobile version