ప్రియదర్శి, హర్షిత్, గౌరీ ప్రియ ప్రధాన పాత్రధారులుగా స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రియాంక దత్ నిర్మించిన సినిమా ‘మెయిల్’. ఓటీటీ కోసం తీసిన ఈ సినిమాను ఈ యేడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ‘ఆహా’లో స్ట్రీమింగ్ చేశారు. 1980 నేపథ్యంలో సాగే ఈ పల్లెటూరి ప్రేమకథా చిత్రాన్ని యువతరం బాగా ఆదరించింది. కంప్యూటర్ వచ్చిన కొత్తలో ఆ టెక్నాలజీకి అలవాటు పడలేక, దానిని అర్థం చేసుకోలేక కుర్రాళ్ళు పడిన తిప్పలను వినోద ప్రధానంగా దర్శకుడు ఉదయ్ గుర్రాల ఈ చిత్రంలో చూపించాడు. అయితే… ఈ కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో ఈ చిత్ర బృందానికి ఓ తీపి కబురు లభించింది. జూన్ 4 నుండి అమెరికాలో జరుగబోతున్న ‘న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘మెయిల్’ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్ని స్వప్న సినిమా సంస్థ ట్వీట్ చేస్తూ, తన హర్షాన్ని వెలిబుచ్చింది. ‘కంబాలపల్లి కథలు’ సీరిస్ లో తొలిగా వచ్చిన ‘మెయిల్’కు లభించిన ఆదరణను దృష్ట్యా మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఓటీటీ చిత్రాలు ఇదే సీరిస్ లో తీస్తారేమో చూడాలి.