Site icon NTV Telugu

Krishnam Raju : మిస్ అయిన గవర్నర్ ఛాన్స్!

Krishnam Raju Missed Governor Chance

Krishnam Raju Missed Governor Chance

సినీరంగంలో కథానాయకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న సమయంలోనే కృష్ణంరాజు రాజకీయ అరంగేట్రమ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిగా ఉన్న ఆయన 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నర్సాపురం నియోజకవర్గం నుండి 1992లో లోక్ సభ స్థానానికి పోటీ చేసి కృష్ణంరాజు ఓటమి పాలయ్యారు. దాంతో తనలాంటి సున్నిత మనస్కుడికి రాజకీయాలు పనికి రావనే నిర్ణయానికి వచ్చేశారు. అయితే హైదరాబాద్ లో బీజేపీ నేతలు నరేంద్ర, విద్యాసాగరరావుతో ఉన్న అనుబంధంతో, వారి ప్రోద్భలంతో మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు కృష్ణంరాజు. భారతీయ జనతాపార్టీ తీర్థం తీసుకుని 1998లో కాకినాడ నుండి ఎం.పీ. గా భారీ మెజారిటీతో గెలిచారు.

అయితే ఆ తర్వాత యేడాదే మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. దాంతో 1999లో నర్సాపురం నుండి కృష్ణంరాజు పోటీ చేయాల్సి వచ్చింది. అక్కడ కూడా ఆయన విజయకేతనం ఎగరేశారు. 1992లో ఓడిపోయిన ఆ నియోజకవర్గం నుండే ఈసారి కృష్ణంరాజు గెలవడం విశేషం. దాంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో సహాయ మంత్రిగానూ కృష్ణంరాజు సేవలు అందించే ఆస్కారం ఏర్పడింది. విదేశాంగ శాఖ సహాయమంత్రిగా, రక్షణ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆహార శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నెరవేర్చారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో తన నియోజకవర్గంలోనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే 2004లో అదే నర్సాపురం పార్లమెంట్ నుండి పోటీ చేసి కృష్ణంరాజు ఓటమి పాలయ్యారు. చిత్రం ఏమంటే… ఈ సారి ఆయన ఓడిపోయింది తన స్నేహితుడు, గోపీకృష్ణ మూవీస్ ప్రారంభ భాగస్వామి అయిన చేగొండి హరి రామజోగయ్య చేతిలో. స్నేహితుడి చేతిలో ఓటమి పాలు కావడంతో అది తనను పెద్దగా బాధింపచేయ లేదని కృష్ణంరాజు చెబుతుండేవారు.

ఇక ఆ తర్వాత నటుడు చిరంజీవి పెట్టిన ‘ప్రజారాజ్యం’ పార్టీలోకి అడుగుపెట్టి 2009లో రాజమండ్రి పార్లమెంట్ నుండి కృష్ణంరాజు పోటీ చేశారు. ఆ సమయంలో మరో ప్రముఖ నటుడు మురళీమోహన్ టీడీపీ అభ్యర్థిగా కృష్ణంరాజుతో పోటీ పడ్డారు. అయితే వీరిద్దరి మీద కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్‌ కుమార్ విజయం సాధించారు. కృష్ణంరాజుకు మూడో స్థానం దక్కింది. అప్పటి నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు కృష్ణంరాజు. ప్రజా రాజ్యం పార్టీకి సైతం రాజీనామా చేసి తిరిగి బీజేపీలో చేరారు. కృష్ణంరాజు సోదరుడి తనయుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రధాని మోదీతో ఉన్న అనుబంధంతో పలు సార్లు కృష్ణంరాజు ఆయన్ని కలిశారు.

దాంతో కృష్ణంరాజుకు ఖచ్చితంగా గవర్నర్ పదవి వస్తుందనే ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో ఆయనకు గరవ్నర్ పదవి ఇచ్చేశారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదని కృష్ణంరాజు స్వయంగా ఖండించాల్సి వచ్చింది. బీజేపీ అంటే ఎంత అభిమానం ఉన్నా, కేంద్ర సహాయ మంత్రిగా సేవలు అందించినా, ఆయన మధ్యలో ప్రజారాజ్యం పార్టీ లోకి వెళ్ళడం రాజకీయ జీవితంలో చేసిన తప్పుగానే భావించాలి. బహుశా అందుకే బీజేపీ నేతలు ఆయనకు గవర్నర్ పదవిని ఇచ్చి ఉండకపోవచ్చు! ఏదేమైనా… కృష్ణంరాజును గవర్నర్ గా చూడాలని అనుకున్న ఆయన అభిమానులకు మాత్రం అది తీరని కోరికగా మిగిలిపోయింది.

Exit mobile version