Site icon NTV Telugu

Kotha Loka : భారత తొలి మహిళా సూపర్ హీరో మూవీ ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ రిలీజ్!

Kotha Loka 1 Chandra

Kotha Loka 1 Chandra

భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే అరుదు. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక 1: చంద్ర’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. విడుదలైన తక్షణమే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కళ్యాణి ప్రియదర్శన్ పవర్‌ఫుల్ లుక్‌తో ఆకట్టుకోగా, నస్లెన్ కె. గఫూర్ కూడా కీలక పాత్రలో మెప్పించారు.

ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్‌కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా, చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించింది. భారతీయ సంస్కృతి, జానపదాలు, పురాణాలలో పాతుకుపోయిన ఒక సాహసోపేతమైన కొత్త సినిమాటిక్ యూనివర్స్ యొక్క ప్రారంభాన్ని సూచిస్తూ.. పురాణాలను ఆధునిక యాక్షన్‌తో మిళితం చేసిన దృశ్యకావ్యంలా ఈ చిత్ర ట్రైలర్ ఉంది. ఉత్కంఠభరితమైన యుద్ధభూమి దృశ్యాలతో ట్రైలర్ ప్రారంభమైన తీరు మరింత ఆకట్టుకుంది. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కళ్యాణి ప్రియదర్శన్‌ చాలా శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఆమెతో పాటు, సన్నీగా నస్లెన్ కె. గఫూర్ మెప్పించారు.

డొమినిక్ అరుణ్ రచయితగా వ్యవహరించిన ఈ మూవీకి శాంతి బాలచంద్రన్ అదనపు స్క్రీన్ ప్లే అందించారు. ట్రైలర్‌లో అంతర్జాతీయ స్టంట్ నిపుణుడు యానిక్ బెన్ కొరియోగ్రఫీ, జేక్స్ బెజోయ్ సంగీతం, నిమిష్ రవి ఛాయాగ్రహణం ప్రధాన బలంగా నిలిచాయి. వెండితెరపై ఓ గొప్ప దృశ్యకావ్యాన్ని చూడబోతున్నామనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది. కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్న ఈ ‘కొత్త లోక 1: చంద్ర’ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది.

 

Exit mobile version