NTV Telugu Site icon

‘మనీ హయిస్ట్’ బాటలో మళయాళ ‘కొచ్చి హయిస్ట్’!

Kochi Heist to premiere on April 29th on Behindwoods

ఓటీపీ లవర్స్ ను భలేగా ఆకట్టుకుంది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన వెబ్ సీరీస్ ‘మనీ హయిస్ట్’. నిజానికి ఇది స్పెయిన్ సీరీస్ ‘లా కాసా డి ప్యాపెల్’ పేరుతో అలరించింది. రెండు భాగాలుగా రూపొందిన ఈ సీరీస్ 15 ఎపిసోడ్స్ తో మురిపించింది. అయితే దీనిని 22 ఎపిసోడ్స్ కు మలచి కొంత రీ షూట్ చేసి ‘నెట్ ఫ్లిక్స్’ ఇదే సీరీస్ ను ‘మనీ హయిస్ట్’ పేరుతో స్ట్రీమింగ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ పొందడంతో ‘హయిస్ట్ సీరీస్’పై ఎంతోమంది మనసు పారేసుకున్నారు. బ్యాంకును దోపిడీ చేసే కథతో ఈ సీరీస్ తెరకెక్కి, దోపిడీ చిత్రాలలో ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. రియల్ టైమ్ క్రైమ్ తో ఫ్లాష్ బ్యాక్స్ ద్వారా ఈ సీరీస్ రక్తి కట్టించింది. ఈ సీరీస్ ప్రేరణతో ప్రస్తుతం మళయాళంలో ‘కొచ్చి హయిస్ట్’అనే సీరీస్ ను రూపొందించారు. ఏప్రిల్ 29న రాత్రి 12 గంటలకు ‘బిహైండ్ ఊడ్స్’లో ఈ ‘కొచ్చి హయిస్ట్’ ప్రసారం కానుంది. బిహైండ్ ఊడ్స్ నిర్మించిన ఈ సీరీస్ కు అతుల్ .ఆర్ దర్శకత్వం వహించగా, కార్తిక్ శంకర్, దేవిక నంబియార్ ప్రధాన పాత్రధారులు.

కొచ్చిలో జరిగే దోపీడీ కథతో ఈ సీరీస్ తెరకెక్కింది. ‘మనీ హయిస్ట్’ స్ఫూర్తితో రూపొందిన ఈ ‘కొచ్చి హయిస్ట్’లోనూ థ్రిల్ కలిగించే అంశాలు ఉంటాయని అతుల్ అంటున్నాడు. కేరళవాసులను ఈ సీరీస్ ఆకట్టుకుంటుందనే ఆశాభావంతో ఉన్నాడు అతుల్. ‘మనీ హయిస్ట్’ ఇప్పటికి నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఈ సీరీస్ కు ఉన్న క్రేజ్ ను బట్టి ఐదో సీజన్ కూడా రూపొందించాలనే ప్లాన్ లో నెట్ ఫ్లిక్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో కానీ, ఆ లోగా మన దేశవాసులను ‘కొచ్చి హయిస్ట్’ ఆకట్టుకుంటుందనే అభిలాషతో ఈ సీరీస్ యూనిట్ మెంబర్స్ ఉన్నారు. ఈ ‘కొచ్చి హయిస్ట్’ ట్రైలర్ ను ఇటీవల ప్రముఖ మళయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఆవిష్కరించాడు. ప్రస్తుతం ‘కొచ్చి హయిస్ట్’ ట్రైలర్ కూడా జనాన్ని అలరిస్తోంది. మరి ఈ వెబ్ సీరీస్ ఏ తీరున ఆకట్టుకుంటుందో చూడాలి.