Keerthy Suresh Satyavan Savithri Faces Tough Competition: ‘మహానటి’ కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తిరిగి కెరీర్‌పై దృష్టి పెట్టిన కీర్తి.. వరుస చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఇటీవల ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’లో స్పెషల్ సాంగ్ చేసినప్పటికీ.. అది పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ‘డోరతి’ సినిమాలో టైటిల్ రోల్ పోషించినా.. ఆమె తెరపై కనిపించింది కొద్దిసేపే. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది.
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘అక్క’ వెబ్ సిరీస్ కూడా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ఇలా వరుస పరాజయాలతో సతమతమవుతున్న కీర్తి.. మరోసారి ఫీమేల్ సెంట్రిక్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కీర్తి నటించిన తాజా చిత్రం ‘సత్యవాన్ సావిత్రి’ నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దర్శకుడు ప్రవీణ్ ఎస్ విజయ్ ఈ చిత్రాన్ని కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు మిస్కిన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కీర్తి న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు.
అయితే సత్యవాన్ సావిత్రి విడుదల తేదీని చూస్తే.. కీర్తి సురేష్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. నవంబర్ 20న తమిళంలో ధనుష్, మమ్ముట్టి నటించిన ‘ఓమ్’ విడుదల కానుంది. అదే సమయంలో తెలుగులో దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఓ తార’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొంది. గతంలో ధనుష్, దుల్కర్‌లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న కీర్తి.. ఇప్పుడు వారితోనే బాక్సాఫీస్ పోటీని ఎదుర్కోబోతున్నారు. ఇప్పటికే వరుస పరాజయాలతో ఉన్న ఆమెకు సత్యవాన్ సావిత్రి విజయం సాధించడం ఎంతో కీలకం. మరి ఈ సినిమా కీర్తికి విజయాన్ని అందించి పాత ఫ్లాప్‌ల గాయాలను మాన్పుతుందా? లేదా మరోసారి నిరాశపరుస్తుందా? అన్నది తెలియాలంటే నవంబర్ 20 వరకు వేచి చూడాల్సిందే.

