Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!

Keerthy Suresh

Keerthy Suresh

Keerthy Suresh: హీరోయిన్ కీర్తి సురేశ్ తన 13 ఏళ్ల సినీ కెరీర్‌లో ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్స్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే తాజాగా ఆమె న్యాచురల్ స్టార్ నాని కోసం ‘ది ప్యారడైజ్’లో ప్రత్యేక గీతంలో కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ పాటను ఐటం సాంగ్‌గా ప్రచారం చేసినప్పటికీ.. కీర్తి మాత్రం ఈ సాంగ్‌లో గ్లామర్‌కు దూరంగా చీరకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపించడం విశేషం. హీరోయిన్‌గా 2013లో మలయాళ చిత్రం ‘గీతాంజలి’తో కెరీర్ ప్రారంభించిన కీర్తి.. దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ఇప్పటి వరకు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వచ్చింది. తన 13 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా ఐటం సాంగ్స్‌లో కనిపించిన దాఖలాలు లేవు. అయితే తాజాగా కీర్తి సురేష్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో కీర్తి స్పెషల్ సాంగ్ చేసింది. నానితో గతంలో ‘నేను లోకల్’, దసరా సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన కీర్తి.. ప్యారడైజ్ కోసం ఆయన అడగడంతో ఈ పాట చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.

ఈ పాటను మొదట ఐటం సాంగ్‌గా ప్రచారం చేసినప్పటికీ.. తాజాగా విడుదలైన తర్వాత మాత్రం అది పూర్తిస్థాయి ఐటం సాంగ్‌లా లేదనే అభిప్రాయాలు ఆడియన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. కీర్తి సురేశ్ ఈ సాంగ్‌లో ఎక్కడా కూడా హద్దులు దాటి, గ్లామర్‌ను ప్రదర్శించకుండా చీరకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపించిందని అంటున్నారు. పాటలో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుందని కితాబు ఇస్తున్నారు. కీర్తి మరో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ పాట కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. దాదాపు 20 గంటల పాటు నిద్ర లేకుండా పని చేసినట్లు ఆమె స్వయంగా వెల్లడించిన వీడియో కూడా ఆసక్తిని పెంచింది. బిజీ షెడ్యూల్‌లోనూ నాని కోసం ఈ సాంగ్ చేయడానికి ఆమె ప్రత్యేక ఆసక్తి చూపినట్లు టాక్. ‘ది ప్యారడైజ్’లోని ‘ఏషనాగుల కట్ట’ ఫోక్ మాస్ బీట్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను ప్రభా, బంగారి గళ్ల, అద్దుల జింగిరెడ్డి పాడారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ మ్యూజికల్ కాన్సర్ట్‌లో ఈ పాటను ప్రత్యేకంగా విడుదల చేశారు. స్టేజ్‌పై నానితో కలిసి అనిరుధ్ స్టెప్పులేయడంతో ఈ పాటకు మరింత జోష్ వచ్చింది. ఆగస్టు 29న ఈ సాంగ్‌ను మేకర్స్ డిజిటల్‌గా రిలీజ్ చేసిన వెంటనే ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో వెంకటేష్‌తో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన్’లోనూ హీరోయిన్‌గా కనిపించనుంది. మలయాళం, తమిళం, హిందీ భాషల్లోనూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కీర్తి.. ఇలాంటి సమయంలో ‘ది ప్యారడైజ్’ కోసం స్పెషల్ సాంగ్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.