Keerthy Suresh: సెలబ్రిటీలను చూడగానే కొందరు అభిమానులు చూపించే అత్యుత్సాహం ఒక్కోసారి హద్దులు దాటి తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుంది. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌కు ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న టైంలో ఊహించని షాకింగ్ అనుభవం ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి సెల్ఫీ కోసం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, ఎంత చెప్పినా వినకుండా రచ్చ రచ్చ చేశాడు. చివరకు విమాన సిబ్బంది జోక్యంతో ఆ గొడవ సద్దుమణిగింది. ఈ చేదు ఘటన గురించి కీర్తి స్వయంగా బయటపెట్టడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన భర్త ఆంటోని థట్టిల్తో కలిసి మిలాన్ నుంచి ఇండియాకు విమానంలో తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్లైట్ గాల్లో ఉండగా సరిగ్గా కాళ్లపై నిలబడలేని స్థితిలో ఉన్న ఒక ప్రయాణికుడు కీర్తి సురేశ్ సీటు దగ్గరకు వచ్చి సెల్ఫీ కావాలని అడిగాడు. అతడి పరిస్థితి చూసి, కాసేపు ఆగాక తీసుకుందామని కీర్తి చాలా మర్యాదగా చెప్పారు. కానీ మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి వినకుండా, ఇప్పుడే సెల్ఫీ దిగాలంటూ ఆమెపై విపరీతంగా ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు.
అతడి మొండివైఖరి చూసి కీర్తి తీవ్ర అసహనానికి గురయ్యారు. “నేను ఎప్పుడు ఫొటో తీసుకోవాలో మీరు నిర్ణయించలేరు” అని ముఖం మీదే స్పష్టంగా తేల్చి చెప్పారు. పక్కనే ఉన్న ఆమె భర్త ఆంటోని కూడా అతడిని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించినా అతడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పరిస్థితి శృతిమించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కీర్తి దంపతులు ఫ్లైట్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది అతడిని అక్కడి నుంచి తరలించి గొడవను ఆపేశారు. సాధారణంగా అభిమానులతో మాట్లాడటం తనకు ఎంతో ఇష్టమని, కానీ కనీస వ్యక్తిగత పరిమితులను పాటించని ఇలాంటి కొందరి వల్లే ఇబ్బందులు ఎదురవుతుంటాయని కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎంతోమంది అభిమానులు చాలా హుందాగా, ఆప్యాయంగా పలకరిస్తారని, అలాంటి వారిని ఎప్పటికీ మరిచిపోలేనని ఆమె పేర్కొన్నారు.

