Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్‌ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!

Keerthy Suresh Sathyavan Savithiri

Keerthy Suresh Sathyavan Savithiri

ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌.. ఇప్పుడు వరుస విజయాల కోసం ఎదురుచూస్తోంది. బాలీవుడ్‌లో ‘బేబీ జాన్‌’తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చినా.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. మరోవైపు నాని నటించిన ‘ది పారడైజ్‌’లో స్పెషల్‌ సాంగ్‌తో సందడి చేసినా.. సినిమా ఫలితం అనుకూలంగా లేకపోవడంతో కీర్తికి ఆశించిన గుర్తింపు దక్కలేదు. గ్లామర్‌ పాత్రలైనా, ప్రత్యేక పాత్రలైనా.. కెరీర్‌కు నిజమైన బలం మాత్రం విజయవంతమైన సినిమాలే. ఈ నేపథ్యంలో తనకు వస్తున్న అవకాశాలను బాక్సాఫీస్‌ విజయాలుగా మార్చుకోవడం కీర్తికి కీలకంగా మారింది.

ప్రస్తుతం కీర్తి సురేష్‌ ఆశలన్నీ కొత్త కోర్ట్‌రూమ్‌ డ్రామా ‘సత్యవాన్‌ సావిత్రి’పైనే ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌లో కోర్టులో తడబడే ఇంగ్లీష్‌, అమాయకమైన వాదనలతో ఆమె పాత్ర నవ్వులు పూయిస్తోంది. దీంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. నవంబర్‌ 20న విడుదల కానున్న ఈ సినిమా కీర్తి కెరీర్‌కు కీలకంగా మారనుంది. కథ, పాత్రలోని వైవిధ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఆమెకు మరో విజయాన్ని అందించే అవకాశం ఉంది. తెలుగులోనూ కీర్తి కీలకమైన ప్రాజెక్టులపై ఆశలు పెట్టుకుంది. విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’లో ఆమె కథానాయికగా కనిపించనుంది. గ్రామీణ నేపథ్యంలో, మాస్‌ లుక్‌, తూర్పు గోదావరి యాసతో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విజయ్‌తో కీర్తి జోడీ ఎలా ఉండబోతోందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

వెంకటేష్‌, కళ్యాణ్‌ రామ్‌ నటిస్తున్న మరో చిత్రంలోనూ కీర్తి కీలక పాత్రలో కనిపించనుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు ఆమె కెరీర్‌లో మరో ముఖ్యమైన అవకాశంగా నిలవనుంది. విభిన్నమైన కథలు, పేరున్న నటులతో కలిసి పనిచేస్తూ తన నటనా పరిధిని మరింత విస్తరించుకునే ప్రయత్నంలో కీర్తి ఉంది. ‘సత్యవాన్‌ సావిత్రి’తో పాటు ‘డోరతీ’, ‘రఫ్తార్‌’, ‘అక్క’, ‘కన్నివేడి’, ‘తోట్టం’ వంటి సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో కీర్తి విభిన్న జానర్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. క్రైమ్‌ థ్రిల్లర్లు, యాక్షన్‌ కథలు, ఇతర భాషల్లో తెరకెక్కుతున్న విభిన్న చిత్రాల ద్వారా కొత్త తరహా పాత్రలను ఎంచుకుంటోంది. పాత్రల ఎంపికలో వైవిధ్యం కనిపిస్తున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం అందుకోవాల్సి ఉంది. కీర్తి కెరీర్‌లో ఇప్పుడు కీలకమైన దశ కొనసాగుతోంది. మంచి విజయాన్ని ఈ మహానటి ఎప్పుడు అందుకుంటుందో చూడాలి.