Kavya Maran-Anirudh Wedding: పురోహితులు లేకుండానే పెళ్లి.. ‘స్వాభిమానం’ మ్యారేజ్ అంటే?.. అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో ఆసక్తికర విశేషాలు!

Kavya Anirudh Self Respect Marriage

Kavya Anirudh Self Respect Marriage

Kavya Maran-Anirudh Self-Respect Marriage: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 11న గ్రీస్‌లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో అనిరుధ్-కావ్య పెళ్లికి అనుసరించిన సంప్రదాయాలు కూడా నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కావ్య మెడలో అనిరుధ్ ఓ గొలుసు కడుతున్నట్లు కనిపించిన ఫొటో వైరల్ కావడంతో.. వీరిది ‘స్వాభిమానం’ వివాహమా? అనే చర్చ మొదలైంది.

పూలమాలలు, గొలుసులు మార్చుకున్న అనిరుధ్, కావ్య:


ఈ నేపథ్యంలో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) ఐటీ విభాగం కార్యదర్శి డాక్టర్ టీఆర్‌బీ రాజా పెళ్లి వేడుకలో జరిగిన ఆచారాలపై స్పష్టత ఇచ్చారు. అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ స్వాభిమానం వివాహం చేసుకున్నారని ఎక్స్ వేదికగా వెల్లడించారు. వివాహ వేడుకలో అనిరుధ్, కావ్య ఒకరికొకరు పూలమాలలు, గొలుసులు మార్చుకున్నారని రాజా తెలిపారు. ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు నూతన దంపతులను ఆశీర్వదించారని పేర్కొన్నారు. ‘అవును.. కావ్య, అనిరుధ్ ఒకరికొకరు పూలమాలలు వేసుకున్నారు. తలైవర్ కావ్యకు ఒక గొలుసును అందించగా, సూపర్‌స్టార్ అనిరుధ్‌కు మరో గొలుసును అందించారు. అనంతరం వధూవరులు ఒకరికొకరు గొలుసులు మార్చుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆశీస్సులతో వారి హృదయాల కలయిక జరిగింది’ అని రాజా వివరించారు.

స్వాభిమానం వివాహం అంటే ఏమిటి?:
తమిళనాడులో సామాజిక సంస్కర్త పెరియార్ ఈవీ రామసామి ప్రారంభించిన స్వాభిమానం ఉద్యమం నుంచి ఈ వివాహ సంప్రదాయం ఆవిర్భవించింది. కుల వివక్ష, సంప్రదాయ వివాహ ఆచారాలు, పెళ్లిళ్లలో మతపెద్దల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఈ ఉద్యమం ముందుకు సాగింది. స్వాభిమానం వివాహంలో వధూవరులు ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా అంగీకరిస్తూ తమ నిబద్ధతను ప్రకటిస్తారు. ఇందుకోసం పూలమాలలు లేదా ఉంగరాలు మార్చుకోవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఇతర సాక్షుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది. సాధారణంగా ఇందులో పురోహితుడు లేదా విస్తృతమైన మతపరమైన క్రతువులు తప్పనిసరి కావు.

చట్టబద్ధమైన గుర్తింపు:
1967లో తమిళనాడులో ఈ వివాహ పద్ధతికి చట్టబద్ధమైన గుర్తింపు లభించింది. హిందూ వివాహ చట్టానికి చేసిన సవరణ ద్వారా సంప్రదాయ మతపరమైన వేడుకలు లేకుండానే స్వాభిమానం వివాహాలను చట్టబద్ధంగా నిర్వహించుకునే అవకాశం కల్పించారు. ఇలా అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ తమ వివాహ వేడుకలో స్వాభిమానం వివాహ పద్ధతిని అనుసరించినట్లు డీఎంకే నేత టీఆర్‌బీ రాజా వెల్లడించడంతో ఈ పెళ్లి మరోసారి వార్తల్లో నిలిచింది.