NTV Telugu Site icon

Kaikala Satyanarayana: న‌వ‌ర‌స న‌ట‌నాసార్వ‌భౌముడు… స‌త్య‌నారాయ‌ణ‌!

Kaikala Satyanarayana

Kaikala Satyanarayana

Kaikala Satyanarayana: తెలుగు చిత్ర‌సీమ‌లో ఎంద‌రో త‌మ‌దైన అభిన‌యంతో జ‌నాన్ని విశేషంగా ఆక‌ట్టుకొని అల‌రించారు. వారిలో కొంద‌రు న‌ట‌సార్వ‌భౌములుగా, మ‌రికొంద‌రు న‌ట‌చ‌క్ర‌వ‌ర్తులుగా, న‌ట‌స‌మ్రాట్టులుగానూ, ఇంకొంద‌రు న‌ట‌విరాట్టులుగానూ విరాజిల్లారు. తెలుగునాట మ‌న‌కు క‌నిపించే న‌ట‌సార్వ‌భౌములు ముగ్గురే – వారు విశ్వ‌విఖ్యాత న‌టసార్వ‌భౌమ య‌న్.టి.రామారావు, న‌ట‌సార్వ‌భౌమ య‌స్.వి.రంగారావు, న‌వ‌ర‌స న‌ట‌నాసార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ‌. తెలుగు చిత్ర‌సీమ‌లో అల‌రించిన అరుదైన న‌టుల‌లో నిస్సందేహంగా కైకాల స‌త్య‌నారాయ‌ణ పేరు చెరిగిపోని, త‌రిగిపోని చ‌రిత్ర‌ను సొంతంచేసుకుంది అన‌డం అతిశ‌యోక్తి కాదు. ప్ర‌తినాయ‌కునిగా స‌త్య‌నారాయ‌ణ జ‌డిపించారు. గుణ‌చిత్ర‌న‌టునిగా మురిపించారు. హాస్యంతో అల‌రించారు. క‌రుణంతో క‌ట్టిప‌డేశారు. ఒక్క‌టేమిటి న‌వ‌ర‌సాల‌నూ స‌త్య‌నారాయ‌ణ అల‌వోక‌గా పండించారు. అందుకే జ‌నం ఆయ‌న‌ను `న‌వ‌ర‌స న‌ట‌నాసార్వ‌భౌమ‌` అంటూ కీర్తించారు.

కైకాల స‌త్య‌నారాయ‌ణ 1935 జులై 25న కృష్ణాజిల్లా కౌతారంలో జ‌న్మించారు. గుడ్లవ‌ల్లేరులో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన స‌త్య‌నారాయ‌ణ‌. విజ‌య‌వాడ‌లో ఇంట‌ర్మీడియ‌ట్, గుడివాడ కాలేజీలో ప‌ట్టా పుచ్చుకున్నారు. చ‌దువుకొనే రోజుల్లోనే నాట‌కాలు వేస్తూ సాగారు. కొన్ని నాట‌కాల్లో స్త్రీవేషాలూ వేసిఆక‌ట్టుకున్నారు. మిత్రులు ఆయ‌న‌ను `అచ్చు య‌న్టీఆర్ లా ఉన్నావ్` అనేవారు. అదే ఆయ‌న‌లో ఆత్మ‌విశ్వాసం పెంచింది. ఓ సారి స‌త్య‌నారాయ‌ణ వేసిన నాట‌కాన్ని చూసిన కొంద‌రు సినిమా జ‌నం ప్ర‌ముఖ నిర్మాత డి.ఎల్.నారాయ‌ణ‌కు అత‌ను య‌న్టీఆర్ పోలిక‌ల‌తో ఉన్నార‌ని చెప్పారు. డి.య‌ల్ . నారాయ‌ణ తాను తీస్తోన్న `సిపాయి కూతురు`లో జ‌మున స‌ర‌స‌న నాయ‌కునిగా స‌త్య‌నారాయ‌ణ‌ను ఎంచుకున్నారు. కొత్త హీరో,అందునా జ‌మున వంటి సీనియ‌ర్ స‌ర‌స‌న ఏమి బాగుంటుంద‌ని ఫైనాన్సియ‌ర్స్ పెద‌వి విరిచారు. డి.య‌ల్. మాత్రం జంకకుండా స‌త్య‌నారాయ‌ణ‌నే ఎంచుకున్నారు. మొత్తానికి తొలి చిత్రం `సిపాయి కూతురు`లోనే జ‌మున స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కింది. కానీ, ఆ చిత్రం ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో స‌త్య‌నారాయ‌ణ‌కు మ‌రి వేషాలు ద‌క్క‌లేదు. ఆ స‌మ‌యంలో బి.విఠ‌లాచార్య స‌త్య‌నారాయ‌ణ‌ను ప్రోత్స‌హించారు. తాను తెర‌కెక్కించిన `క‌న‌క‌దుర్గ పూజా మ‌హిమ‌`లో స‌త్య‌నారాయ‌ణ‌కు కీల‌క పాత్ర‌ను ఇచ్చారు. అదే స‌మ‌యంలో య‌న్టీఆర్ కు స‌న్నిహితుడైన య‌స్.డి.లాల్ ద‌ర్శ‌కునిగా తొలి ప్ర‌య‌త్నంలో `స‌హ‌స్ర శిర‌చ్ఛేద అపూర్వ చింతామ‌ణి` తెర‌కెక్కిస్తూ అందులో రాజ‌కుమారుని పాత్రను స‌త్య‌నారాయ‌ణ‌కు ఇచ్చారు. ఈ రెండు చిత్రాలు స‌త్య‌నారాయ‌ణ‌కు న‌టునిగా మంచి మార్కులు సంపాదించిపెట్టాయి.

ఆ త‌రువాత కూడా స‌త్య‌నారాయ‌ణ‌కు అంత‌గా అవ‌కాశాలు ల‌భించ‌లేదు. ఆ స‌మ‌యంలో య‌న్టీఆర్ తో డి.రామానాయుడు `రాముడు-భీముడు` తీస్తున్నారు. అందులో య‌న్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఆ చిత్రంలో య‌న్టీఆర్ కు `బాడీ డ‌బుల్`గా స‌త్య‌నారాయ‌ణ స‌రిపోతార‌ని చెప్పారు. హీరోగా ప‌రిచ‌య‌మైన న‌టుడు, ఓ స్టార్ హీరోకు బాడీ డ‌బుల్ గా చేయ‌డం నిజంగా విచార‌క‌ర‌మే! అయితే తాను ఎలాగైనా చిత్ర‌సీమ‌లో నిల‌దొక్కుకోవాల‌ని అని భావించిన స‌త్య‌నారాయ‌ణ య‌న్టీఆర్ కు డూప్ గా న‌టించ‌డానికి ఓకే అన్నారు. య‌న్టీఆర్ సైతం అత‌ని ప‌ట్టుద‌ల‌ను మెచ్చి ప్రోత్స‌హించారు. అంతేకాదు, క్ల‌యిమాక్స్ లో నేరుగా స‌త్య‌నారాయ‌ణ‌నే న‌టింప చేశారు. ఆ సినిమా విడుద‌ల‌యి, ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో య‌న్టీఆర్ బాడీ డ‌బుల్ గా న‌టించిన స‌త్య‌నారాయ‌ణ‌కు కూడా మంచి గుర్తింపు ల‌భించింది. ఆ త‌రువాత య‌న్టీఆర్ అనేక చిత్రాల‌లో స‌త్య‌నారాయ‌ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తూ సాగారు. ఆయ‌న‌కు న‌టునిగా ట‌ర్నింగ్ పాయింట్ య‌న్టీఆర్ `ఉమ్మ‌డి కుటుంబం`తోనే ల‌భించింది. అందులో య‌న్టీఆర్ కు రెండో అన్న‌గా స‌త్య‌నారాయ‌ణ న‌టించారు. క‌రుణ‌ర‌స ప్ర‌ధాన‌మైన ఆ పాత్ర‌తో న‌టునిగా స‌త్య‌నారాయ‌ణ‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.

స‌త్య‌నారాయ‌ణ చాలా చిత్రాల‌లో క్రూర పాత్ర‌లే ధ‌రించారు. దాంతో జ‌నం కూడా స‌త్య‌నారాయ‌ణ అంటే జ‌డుసుకొనేవారు. 1970ల నుండి స‌త్య‌నారాయ‌ణ హ‌వా మొద‌ల‌యింది. అప్ప‌టి దాకా రాజ‌నాల‌, నాగ‌భూష‌ణం వంటివారు ప్ర‌తినాయ‌కులుగా రాణించారు. య‌న్టీఆర్ హీరోగా కె.విశ్వ‌నాథ్ తెర‌కెక్కించిన `నిండు హృద‌యాలు`లో స‌త్య‌నారాయ‌ణ ప్ర‌ధాన ప్ర‌తినాయ‌కుడు. ఆ సినిమా విజ‌యంతో ఇత‌ర హీరోలు సైతం స‌త్య‌నారాయ‌ణ‌నే త‌మ చిత్రాల‌లో విల‌న్ గా న‌టించాల‌ని కోరారు. అలా ఒక్క యేడాదిలోనే స‌త్య‌నారాయ‌ణ స్టార్ యాక్ట‌ర్ అయిపోయారు. య‌న్టీఆర్, ఏయ‌న్నార్ చిత్రాల‌లోనే కాదు అప్ప‌ట్లో వ‌ర్ధ‌మాన క‌థానాయ‌కులుగా రాణిస్తున్న శోభ‌న్ బాబు, కృష్ణ చిత్రాల‌లోనూ ఆయ‌నే విల‌న్ గా న‌టించి మెప్పించేవారు. ఒకానొక ద‌శ‌లో తిండి తిన‌డానికి కూడా తీరిక లేనంత‌గా స‌త్య‌నారాయ‌ణ బిజీ అయిపోయారు. అప్ప‌ట్లో షూటింగుల‌న్నీ మ‌ద్రాసులోనే జ‌రుగుతూ ఉండ‌డం వ‌ల్ల ఓ సెట్ లో ఓ సినిమా కోసం గంట సేపు న‌టిస్తే , మ‌రో సెట్లో్ మ‌రో చిత్రం కోసం ప‌నిచేసేవారు. ఆ స్టూడియోలో ప‌ని పూర్తి కాగానే మ‌రో స్టూడియోలో అదే తీరున న‌టించేవారు.

ఒక‌ప్పుడు టాప్ హీరోస్ చిత్రాల‌లో బిట్ రోల్స్ లో క‌నిపించినా చాలు అనుకున్న స‌త్య‌నారాయ‌ణ కోసం అదే స్టార్స్ వేచి ఉండే స్థాయికి ఎదిగారు స‌త్య‌నారాయ‌ణ‌. ఆయ‌న ఎంత బిజీగా ఉన్నా కొంత‌మంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆయ‌న‌తోనే తాము అనుకున్న పాత్ర‌లు చేయించ‌డానికి ముందుగా స‌త్య‌నారాయ‌ణ కాల్ షీట్స్ తీసుకొనేవారు. ఆ క్ర‌మంలో కె.విశ్వ‌నాథ్ రూపొందించిన `శార‌ద‌` చిత్రంలో నాయిక అన్న పాత్ర‌లో స‌త్య‌నారాయ‌ణ కరుణ ర‌సం కురిపించారు. ఆ సినిమా కూడా జ‌నాన్ని విశేషంగా అల‌రించింది. దాంతో స‌త్య‌నారాయ‌ణ కేవ‌లం జ‌డిపించే పాత్ర‌లే కాదు, క‌న్నీరు పెట్టించే పాత్ర‌ల్లోనూ మెప్పించ‌గ‌ల‌ర‌ని నిరూపించుకున్నారు.

పౌరాణిక‌, జాన‌ప‌ద‌, చారిత్ర‌క‌, సాంఘికాల్లో స‌త్య‌నారాయ‌ణ త‌న‌దైన బాణీ ప‌లికించారు. య‌న్టీఆర్, య‌స్వీఆర్ వంటి మ‌హాన‌టులు ధ‌రించిన య‌మ‌ధ‌ర్మ‌రాజు, రావ‌ణుడు, దుర్యోధ‌నుడు వంటి పాత్ర‌ల‌ను పోషించి మెప్పించారు స‌త్య‌నారాయ‌ణ‌. మూడు త‌రాల హీరోల చిత్రాల‌లో ప్ర‌తినాయ‌క పాత్ర‌లు పోషించి అల‌రించారాయ‌న‌. నిర్మాత‌గానూ కొన్ని చిత్రాలు నిర్మించి ఆక‌ట్టుకున్నారు. స‌త్య‌నారాయ‌ణ తెలుగు చిత్ర‌సీమ‌కు చేసిన సేవ‌ల‌కు గాను 2011లో ఆయ‌న‌కు `ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డు` ల‌భించింది.

య‌న్టీఆర్ తో దాదాపు వంద చిత్రాల‌లో క‌ల‌సి న‌టించిన స‌త్య‌నారాయ‌ణ‌, ఆయ‌న నెల‌కొల్పిన తెలుగుదేశం పార్టీ త‌ర‌పున 1996లో మ‌చిలీప‌ట్నం నుండి లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. వంద‌లాది చిత్రాల‌లో విలక్ష‌ణ‌మైన పాత్ర‌లు పోషించిన స‌త్య‌నారాయ‌ణ చివ‌రి వ‌ర‌కు న‌టించాల‌నే త‌పించారు. వ‌య‌సు మీద ప‌డ్డా, స్థూల‌కాయం వేధిస్తున్నా, గొంతు బొంగురు పోయినా, స‌త్య‌నారాయ‌ణ త‌న‌ను ఎవ‌రైనా న‌టించ‌మ‌ని కోర‌గానే మ‌రో మాట లేకుండా అంగీక‌రించేవారు. అదీ న‌ట‌న ప‌ట్ల ఆయ‌న‌కున్న అంకిత‌భావం. ఆ మ‌ధ్య మ‌హేశ్ బాబు న‌టించిన `మ‌హ‌ర్షి`లో కాసేపు తెర‌పై క‌నిపించారు స‌త్య‌నారాయ‌ణ‌. అలాగే తాను అన్న‌గా అభిమానించే య‌న్టీఆర్ బ‌యోపిక్ లో `టాకీ పులి` హెచ్.ఎమ్.రెడ్డి పాత్ర‌లోనూ ఆక‌ట్టుకున్నారు. తెలుగు సినిమా ఉన్నంత వ‌ర‌కూ చెరిగిపోని, త‌రిగిపోని కీర్తిని సంపాదించుకున్న అరుదైన న‌టుల‌లో స‌త్య‌నారాయ‌ణ ఖ‌చ్చితంగా ఉంటారు.

అస‌లైన అన్న‌ద‌మ్ముల అనుబంధం!

అచ్చు య‌న్టీఆర్ లా ఉంటార‌ని స‌త్య‌నారాయ‌ణ‌ను ఆయ‌న మిత్రులు అనేవారు. అలాగే చిత్ర‌సీమ‌లో ప్ర‌వేశించిన త‌రువాత కూడా స‌త్య‌నారాయ‌ణ‌ను అలాగే అన్నారు. అందువ‌ల్లే య‌న్టీఆర్ ద్విపాత్రాభిన‌యం చేసిన “రాముడు-భీముడు, అగ్గి-పిడుగు, గోపాలుడు-భూపాలుడు, గండికోట ర‌హ‌స్యం“వంటి చిత్రాల‌లోయ‌న్టీఆర్ కు బాడీ డ‌బుల్ గా న‌టించారు స‌త్య‌నారాయ‌ణ‌. య‌న్టీఆర్ సైతం స‌త్య‌నారాయ‌ణ‌ను త‌న సొంత త‌మ్మునిలాగే చూసుకొనేవారు. తాను న‌టించిన అనేక పౌరాణిక‌,జాన‌ప‌ద‌, చారిత్ర‌క, సాంఘిక చిత్రాల‌లో స‌త్య‌నారాయ‌ణ‌తో కీల‌క‌మైన పాత్ర‌లు పోషింప చేశారు రామారావు. త‌న కెరీర్ ప్ర‌తి మ‌లుపులోనూ య‌న్టీఆర్ ఉన్నార‌ని స‌త్య‌నారాయ‌ణ చెప్పుకొనేవారు. అంతేకాదు, తామిద్ద‌రిదీ అస‌లైన అన్న‌ద‌మ్ముల అనుబంధం అంటూ ఆనందించేవారు. అందువ‌ల్లే రామారావుతో క‌ల‌సి తాను నూటొక్క చిత్రాల‌లో న‌టించాన‌ని స‌త్య‌నారాయ‌ణ గ‌ర్వంగా చెప్పేవారు. య‌న్టీఆర్ చివ‌రి చిత్రంగా విడుద‌లైన `శ్రీ‌నాథ క‌విసార్వ‌భౌముడు`లోనూ స‌త్య‌నారాయ‌ణ న‌టించ‌డం విశేషం!

ఆరంభంలో స‌త్య‌నారాయ‌ణ‌కు య‌న్టీఆర్ ప‌లు చిత్రాల‌లో అవ‌కాశాలు క‌ల్పించారు. అందులో `ల‌వ‌కుశ‌`లో భ‌ర‌తుని వేషం కూడా ఆయ‌నే ప‌ట్టుప‌ట్టి ఇప్పించారు. త‌న పోలిక‌ల‌తోనే ఉన్న భ‌ర‌తుడుగా స‌త్య‌నారాయ‌ణ అయితేనే న్యాయం చేకూరుతుంద‌ని య‌న్టీఆర్ అభిప్రాయం. అలాగే య‌న్టీఆర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించి, నిర్మించిన `శ్రీ‌రామ‌ప‌ట్టాభిషేకం`లోనూ భ‌ర‌తుని పాత్ర‌ను స‌త్య‌నారాయ‌ణ‌తోనే ధ‌రింప‌చేశారు. స‌త్య‌నారాయ‌ణ‌కు న‌టునిగా మంచి మార్కులు సంపాదించి పెట్టిన `ఉమ్మ‌డి కుటుంబం` కూడా య‌న్టీఆర్ సొంత‌చిత్ర‌మే! ఆయ‌న‌ను విల‌న్ గా నిలిపిన‌`నిండుహృద‌యాలు`లోనూ య‌న్టీఆర్ హీరో! ఇక అన్నిటిక‌న్నా మిన్న‌గా చెప్పుకోవ‌ల‌సిన విష‌యం ఏమంటే, య‌న్టీఆర్ అప్ప‌టికే దుర్యోధ‌న పాత్ర‌లో `శ్రీ‌క్రిష్ణ పాండ‌వీయం`లో మెప్పించారు.

Read also: BRS Dharna: కేంద్రం తీరును ఎండగట్టేందుకు కేటీఆర్‌ పిలుపు.. నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు

ఆ త‌రువాత య‌న్టీఆర్ స‌న్నిహితులైన పుండ‌రీకాక్ష‌య్య‌, తిరుప‌త‌య్య నిర్మించిన `శ్రీ‌కృష్ణావ‌తారం`లో తొలుత దుర్యోధ‌న పాత్ర‌కు య‌స్వీ రంగారావును అనుకున్నారు. అయితే ఆయ‌న వేరే సినిమా బిజీగా ఉండ‌డం వ‌ల్ల కాల్ షీట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక పోయారు. అప్పుడు స‌త్య‌నారాయ‌ణ‌తో `శ్రీ‌కృష్ణావ‌తారం`లో దుర్యోధ‌న పాత్ర ధ‌రింప చేశారు రామారావు. ఈ సినిమా విడుద‌ల‌య్యాక ఘ‌న విజ‌యం సాధించి, స‌త్య‌నారాయ‌ణ‌కు ఎంతో పేరు సంపాదించి పెట్టింది. అప్ప‌టి నుంచీ య‌న్టీఆర్ సినిమా అన‌గానే స‌త్య‌నారాయ‌ణ సైతం ఎంత బిజీగా ఉన్నా, రామారావు సినిమాల‌కు డేట్స్ అడ్జెస్ట్ చేసేవారు. అందువ‌ల్లే య‌న్టీఆర్ న‌టించిన అనేక బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో స‌త్య‌నారాయ‌ణ కీల‌క‌పాత్ర‌లు పోషించ‌గ‌లిగారు.

య‌న్టీఆర్ సొంత చిత్రాల‌లో ప‌లు పాత్ర‌లు పోషించిన స‌త్య‌నారాయ‌ణ‌, ఓ సారి “అన్న‌గారూ… నాకూ ఓ సినిమాకు చేసి పెట్టండి…“ అని అడిగారు. య‌న్టీఆర్ ఓకే అన్నారు. త‌త్ఫ‌లితంగా రూపొందిన చిత్ర‌మే `గ‌జ‌దొంగ‌`. కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `గ‌జ‌దొంగ‌` చిత్రాన్ని చ‌ల‌సాని గోపితో క‌ల‌సి స‌త్య‌నారాయ‌ణ నిర్మించారు. ఈ సినిమా ఆ రోజుల్లో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది.

య‌న్టీఆర్ రాజ‌కీయాల్లోకి వెళ్లే ముందు కూడా స‌త్య‌నారాయ‌ణ‌కు క‌బురు చేసి ర‌మ్మ‌ని పిలిచారు. అయితే అప్ప‌ట్లో స‌త్య‌నారాయ‌ణ బిజీగా ఉండ‌డం వ‌ల్ల రాలేన‌ని చెప్పారు. త‌రువాత య‌న్టీఆర్ తెలుగుదేశం పార్టీ పైనే స‌త్య‌నారాయ‌ణ 1996లో మ‌చిలీప‌ట్నం నుండి లోక్ స‌భ‌కు ఎన్నిక కావ‌డం విశేషం. ఆ గెలిచిన స‌మ‌యంలో స‌త్య‌నారాయ‌ణ త‌న అన్న య‌న్టీఆర్ తో త‌న‌కున్న అనుబంధాన్ని ప‌దే ప‌దే త‌ల‌చుకొనేవారు. తాను మ‌రీ లావుగా కావ‌డానికి అన్న అనురాగ‌మే కార‌ణ‌మ‌ని చెప్పేవారు. య‌న్టీఆర్ కు మ‌ద్రాసులో షూటింగ్ ఉంటే రోజూ న‌లుగురు తిన‌గ‌లిగేంత క్యారియ‌ర్ వ‌చ్చేది. అందులో సాయంత్రం స్నాక్స్ కూడా ఉండేవి. అవి కూడా దాదాపు ఇర‌వై మందికి స‌రిప‌డా ఉండేవ‌ట‌. య‌న్టీఆర్ అవి రాగానే, స‌త్య‌నారాయ‌ణ ఆ రోజు షూట్ లో ఉంటే ముందు బ్ర‌ద‌ర్ ను పిల‌వండి అనేవార‌ట‌. క్యారియ‌ర్ ఓపెన్ చేయ‌గానే, `బ్ర‌ద‌ర్… ఈరోజూ తండి విష‌యంలో మీరు మాతో పోటీ ప‌డాలి` అనేవార‌ట‌. దాంతో స‌త్య‌నారాయ‌ణ కాద‌న‌లేక బ‌ల‌వంతంగా తినేవార‌ట‌. అలా త‌మ మ‌ధ్య అన్న‌ద‌మ్ముల అనుబంధం క‌డ‌దాకా సాగింద‌ని స‌త్య‌నారాయ‌ణ ప‌లు సంద‌ర్భాల‌లో గుర్తు చేసుకున్నారు.

హీరోగా వ‌చ్చి… విల‌న్ గా మెప్పించి…

స‌త్య‌నారాయ‌ణ సినిమా కెరీర్ 1959లో `సిపాయి కూతురు`తో హీరోగానే మొద‌ల‌యింది. అయితే ఆ సినిమా ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో స‌త్య‌నారాయ‌ణ‌కు అవ‌కాశాలు రాలేదు. దాంతో ఏమైతే అది కానివ్వ‌నీ, చిత్ర‌సీమ‌లో నిల‌దొక్కుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు స‌త్య‌నారాయ‌ణ‌. త‌న తొలి చిత్రం `సిపాయి కూతురు`లో త‌న స‌ర‌స‌న నాయిక‌గా న‌టించిన జమున‌తో స‌త్యానారాయ‌ణ ప‌లు చిత్రాల‌లో క‌ల‌సి న‌టించారు. అనేక చిత్రాల‌లో ఆమెను భ‌య‌పెట్టే పాత్ర‌ల్లో నటించారు. `డ‌బ్బుకు లోకం దాసోహం` చిత్రంలో అయితే జ‌మున‌ను రేప్ చేసే సీన్ లోనూ న‌టించారు స‌త్య‌నారాయ‌ణ‌. త‌రువాతి రోజుల్లో జ‌మున‌తోనే క‌ల‌సి `ఈ కాలం దంప‌తులు`అనే చిత్రంలో క‌థానాయ‌కునిగానే అభిన‌యించారు. అయితే ఆ సినిమా కూడా ఆట్టే అల‌రించ‌లేక పోయింది. కానీ, త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లో స‌త్య‌నారాయ‌ణ హీరోగా క‌నిపించిన `తాయార‌మ్మ‌-బంగార‌య్య‌` మంచి విజ‌యం సాధించింది. `సంసారం-సాగ‌రం`లోనూ హీరోగా అల‌రించారు స‌త్య‌నారాయ‌ణ‌. ఇక హాస్య‌న‌టుడు న‌గేశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `మొర‌టోడు` చిత్రంలో జ‌య‌సుధ‌కు హీరోగా స‌త్య‌నారాయ‌ణ న‌టించ‌డం ఆ రోజుల్లో విశేషంగా ముచ్చ‌టించుకున్నారు. హిందీలో ప్రాణ్ హీరోగా రూపొందిన `ధ‌ర‌మ్` రీమేక్ గా రూపొందిన `నా పేరే భ‌గ‌వాన్`లో స‌త్య‌నారాయ‌ణ న‌టించారు. ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. హీరోగా చిత్ర‌సీమ‌లో అడుగు పెట్టినా, స‌త్య‌నారాయ‌ణ న‌టునిగా విశేష‌మైన పేరు సంపాదించుకున్న‌ది త‌న విల‌న్ పాత్ర‌ల ద్వారానే. అలా హీరోగా వ‌చ్చి, త‌రువాత విల‌న్ గా మారి, ఆ పై మ‌ళ్ళీ హీరోల‌యిన ఘ‌న‌త కృష్ణంరాజు, చిరంజీవికి ఉంది. కానీ, స‌త్య‌నారాయ‌ణ విష‌యంలో మాత్రం ఆయ‌న విల‌న్ గానే జేజేలు అందుకొని, ఆ త‌రువాత అంద‌రు హీరోల చిత్రాల‌తోనూ ప్ర‌తినాయ‌కునిగా మెప్పించారు. అందుకే ఆయ‌న దాదాపు 750కి పైగా చిత్రాల‌లో న‌టించ‌గ‌లిగారు.

Twitter New CEO: కొత్త ట్విటర్‌ సీఈవోపై సీరియస్ అయిన మస్క్.. ఎందుకంటే

Show comments