Jyotika: సినిమాలకు బ్రేక్ తర్వాత కెమెరా ముందు భయపడ్డా..

Jtothika

Jtothika

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా దశాబ్దాల పాటు వెలుగొందిన నటి జ్యోతిక (Jyotika).. సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. గతేడాది ఓటీటీలో వచ్చిన ‘డబ్బా కార్టెల్’ (Dabba Cartel) తో మెప్పించిన ఆమె, ప్రస్తుతం ‘సిస్టమ్’ (System) అనే ఇంటెన్స్ లీగల్ డ్రామాతో అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జ్యోతిక.. బాలీవుడ్ మారుతున్న తీరు, 40 ఏళ్లు పైబడిన మహిళలకు దక్కుతున్న ప్రాధాన్యత మరియు తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మనకు తెలిసి ఒకప్పుడు హీరోయిన్లకు 30 ఏళ్లు దాటితే అవకాశాలు తగ్గిపోయేవి. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో, ముఖ్యంగా ఓటీటీ రంగం వచ్చాక ఆ హద్దులు చెరిగిపోయాయని జ్యోతిక అభిప్రాయపడ్డారు. బాలీవుడ్‌లో 40 ఏళ్లు పైబడిన నటీమణుల కోసం ఎంతో వైవిధ్యమైన, సవాలుతో కూడిన పవర్‌ఫుల్ పాత్రలు రాస్తున్నారని ఆమె ప్రశంసించారు. తన రాబోయే వెబ్ సిరీస్ / సినిమా ‘సిస్టమ్’ గురించి జ్యోతిక పలు విషయాలు పంచుకున్నారు.. ‘ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా. ఇందులో నా పాత్ర చాలా ఆసక్తికరంగా, ఎమోషనల్‌గా ఎంతో సవాలుతో కూడుకున్నది. ఈ క్యారెక్టర్‌లో నాకు డైలాగులు చాలా తక్కువగా ఉంటాయి. మాటలు లేకుండా కేవలం కళ్లతోనే ఎన్నో భావాలను పలికించే అవకాశం లభించింది. అది కష్టమైనప్పటికీ నటిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రసిద్ధ దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ (Ashwiny Iyer Tiwari) తో పని చేయడం ఎప్పుడూ ఎంతో కంఫర్టబుల్‌గా ఉంటుంది’ అని తెలిపింది. అలాగే తన లాంగ్ బ్రేక్ తర్వాత పడ్డ ఇబ్బందులను జ్యోతిక గుర్తుచేసుకున్నారు.

‘చాలామందికి తెలియదు, నేను 1998లో ‘డోలీ సజా కే రఖ్నా’ అనే హిందీ సినిమాతోనే వెండితెరకు పరిచయమయ్యాను. కానీ ఆ మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఆ వైఫల్యమే నన్ను సౌత్ (తమిళ) చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసేలా చేసింది. కానీ చివరికి చెన్నై నగరం, అక్కడి ప్రేక్షకులు నేను ఆశించిన దానికంటే ఎంతో ఎక్కువే ఇచ్చారు. తర్వాత పెళ్లి, పిల్లల వల్ల సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చాను. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కెమెరా ముందుకు రాగానే నాలో ఒక రకమైన భయం, వణుకు మొదలైంది. అంతా మొదటి నుండి ప్రారంభించినట్లు అనిపించింది. ఆ సమయంలో కేవలం నటన మాత్రమే కాదు, లాంగ్వేజ్ కూడా పెద్ద సవాలుగా మారింది’ అని తెలిపింది.