Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్‌ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?

Jason Sanjay On Vijay

Jason Sanjay On Vijay

Jason Sanjay: తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘సిగ్మా’ (Sigma) చిత్రంతో ఆయన దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘జెన్-జెడ్ విజిలెంట్ యాక్షనర్’గా తెరకెక్కుతున్న ఈ మనీ-సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌‌గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాసన్ సంజయ్ తన సినీ ప్రయాణం, దర్శకత్వంపై తండ్రి విజయ్ ప్రభావం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

డైరెక్షన్ వైపు రావడంపై తండ్రి విజయ్ ప్రత్యేక సూచనల గురించి సంజయ్ మాట్లాడుతూ.. “నాకు ఆయన ఎలాంటి కఠినమైన నిబంధనలు లేదా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. చిన్నప్పటి నుంచి నాన్నతో కలిసి షూటింగ్ సెట్స్‌కి వెళ్తుండటం వల్ల నాకు సినిమాలపై సహజంగానే అవగాహన, ఆసక్తి ఏర్పడ్డాయి. నా స్నేహితులు సినిమాను కేవలం వినోదంగా చూస్తే, నేను మాత్రం దాన్ని ఒక వృత్తిగా, కళగా గమనించేవాడిని.” అని తెలిపారు. తన చదువు పూర్తయ్యాక సొంతంగా విదేశాలకు వెళ్తానని, ఫిలిం మేకింగ్‌ను ఒక కోర్స్‌గా చదువుతానని ఇంట్లో చెప్పినప్పుడు అందరికంటే ముందుగా తన తండ్రి విజయ్ ప్రొత్సహించారని సంజయ్ చెప్పారు. “పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా నా ఆలోచన ప్రాముఖ్యతను నాన్న వెంటనే అర్థం చేసుకున్నారు. ‘ఇప్పుడు ఫిలిం మేకింగ్‌లో ఎన్నో విభాగాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి, కోర్స్ పూర్తి చేస్తేనే నీకు ఏం నచ్చుతుంది, ఏది సెట్ అవుతుంది, అసలు ఈ రంగం నీకు సరిపోతుందో లేదో ఒక స్పష్టత వస్తుంది’ అని ధైర్యం చెప్పారు. నా నిర్ణయానికి ఆయన అందించిన సపోర్ట్ మరువలేనిది,” అని సంజయ్ పేర్కొన్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, యోగ్ జేపి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. స్టార్ కిడ్‌గానే కాకుండా సరైన అర్హతలతో, సొంత ఆలోచనలతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్ మొదటి సినిమాపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.