సంగీతానికి, కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కుతున్న సరికొత్త విజువల్ ట్రీట్ ‘జగమే సంగీతం’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రాబోతున్న ఈ తెలుగు ఒరిజినల్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హిందీలో సంచలన విజయం సాధించిన ‘బందిష్ బాండిట్స్’ వెబ్‌సిరీస్‌కు ఇది తెలుగు అడాప్షన్ కావడం విశేషం. మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా ట్రైలర్.. తన అద్భుతమైన డైలాగ్స్ తో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
“ఇదే మన వైకుంఠపురం.. ముప్పై ఏళ్ల తర్వాత సంగీత భారతిని నిర్ణయించే సమయం వచ్చింది” అంటూ వెటరన్ నటుడు తణికెళ్ల భరణి గంభీరమైన వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఈ సిరీస్ లో ప్రధానంగా దిగ్గజ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగులు అద్భుతంగా పేలాయి. “స్వచ్ఛమైన సంగీతమే నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు.. ఎన్ని పాశ్చాత్య పిల్ల కాలువలు పుట్టుకొచ్చినా.. వాటన్నింటికీ అమ్మ ఈ శాస్త్రీయ సంగీతమే” అంటూ ఆయన చెప్పే తీరు పాత్రలోని గాఢతను పరిచయం చేస్తోంది.
మరోవైపు “సంగీతాన్ని నీ కొడుకు, మనవడు రోడ్డున పడేశాడు.. శాస్త్రి గారు ఇప్పుడు ఏం చేస్తారో” అని శ్రీకాంత్ వేసే సెటైర్, “శ్రుతి తప్పితేనే ఊరుకోను.. గతి తప్పావ్” అంటూ ప్రకాష్ రాజ్ ఫైర్ అవ్వడం కథలోని సంఘర్షణను ఎలివేట్ చేశాయి. శాస్త్రీయ సంగీతానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తాత (శాస్త్రి), తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును వెతుక్కునే మనవడు (బాలు), పల్లవి అనే మోడ్రన్ పాప్ సింగర్.. వీరి విభిన్న ప్రపంచాలు ఒక్కచోట చేరినప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేదే ఈ సిరీస్ మూల కథ.
గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్‌కు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. విశాల్ చంద్రశేఖర్ సమకూర్చిన సంగీతం ట్రైలర్‌కే ప్రాణం పోసింది. వంగాల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఏ.ఆర్. ప్రభావ్ కలిసి ఈ స్క్రిప్ట్‌ను మన నేటివిటీకి తగ్గట్టుగా మలిచారు. అక్షయ్ లగుసాని, సుస్మిత శెట్టి ప్రధాన జంటగా నటించగా.. శ్రీకాంత్, మధుబాల, సుమన్, షఫీ, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 4, 2026వ తేదీన ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో ఏకంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది.

