‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ మరో భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్‌ఫుల్ పొలిటికల్ అండ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’ ప్రీమియర్ తేదీని అధికారికంగా అనౌన్స్ చేసింది. ప్రముఖ ఎడిటర్ అండ్ డైరెక్టర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ హై-వోల్టేజ్ సిరీస్ జూలై 2 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. మొత్తం ఏడు ఎపిసోడ్‌లుగా రాబోతున్న ఈ సిరీస్ పూర్తిగా ఒక కల్పిత పోర్ట్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. అధికారం కోసం జరిగే పోరాటాలు, ఫ్యామిలీ పాలిటిక్స్, మైండ్ గేమ్స్, గ్యాంగ్‌స్టర్ల మధ్య నడిచే నెత్తుటి యుద్ధం ఈ కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్‌ను నిర్మించారు. ప్రశాంత్ కథను అందించగా, తాజుద్దీన్ పవర్‌ఫుల్ డైలాగ్స్ రాశారు.
ఈ సిరీస్‌లో సౌత్ ఇండస్ట్రీకి చెందిన వెర్సటైల్ యాక్టర్లు సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ పోషించారు. వీరితో పాటు సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, రవివర్మ, రాజా చెంబోలు వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ హెడ్ నిఖిల్ మాధోక్ మాట్లాడుతూ “దక్షిణ భారతీయ నేటివిటీ ఉన్న పవర్‌ఫుల్ కథలను గ్లోబల్ ఆడియన్స్‌కు అందించే ప్రయత్నంలో భాగమే ఈ ‘ఇసకపట్నం’. అనూహ్యమైన మలుపులతో సాగే ఈ ఎమోషనల్ రివెంజ్ డ్రామా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది” అని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాతలు కూడా ఒక పోర్ట్ టౌన్ ప్రపంచాన్ని ఎంతో సహజంగా, క్వాలిటీతో స్క్రీన్ పైకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ సిరీస్ ఒరిజినల్ తెలుగు వెర్షన్‌తో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా డబ్బింగ్ కాబడి అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఇంగ్లీష్‌తో సహా దాదాపు 15 భాషల సబ్‌టైటిల్స్‌తో, జూలై 2 నుంచి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో రిలీజ్ కానుంది.

