NTV Telugu Site icon

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్ ఖర్చు ఎంత?

Rrr Promotions

Rrr Promotions

RRR Movie: అందరూ ఊహించినట్లుగానే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటతో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్నారు సంగీత దర్శకుడు కీరవాణి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇది మరపురాని అధ్యాయం. ఇక ఆస్కార్ కి రెండు అడుగుల దూరంలో ఉంది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఈ నెల 24న ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ విడుదల కానుంది. అందులో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటకు చోటు ఖాయం అని గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ నిరూపించింది. దీనితో పాటు ఇతర కేటగిరిల్లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు చోటు దక్కుతుందనే ఆశాభావంతో ఉంది యూనిట్.

Read Also: Tegimpu Review: తెగింపు మూవీ రివ్యూ

నిజానికి ఆస్కార్ గడప తొక్కాలంటే అంత తేలికైన విషయం కాదు. చాలా ఖర్చుతో కూడిన పని కూడా. అంత ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉంటుందో లేదో తెలియని సంగతి. అందుకే మన భారతీయ సినిమాల రూపకర్తలు తమ తమ సినిమాలపై నమ్మకం ఉన్నా ఆ సాహసానికి పూనుకోరు. అయితే రాజమౌళి తన సినిమాల రూపకల్పన విషయంలో ఎంత కాన్ఫిడెంట్ గా, నిబద్ధతతో ఉంటాడో ప్రచారం విషయంలోనూ అంతే దృఢ సంకల్పంతో ఉంటాడు. దానికి తోడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు వచ్చిన అప్లాజ్, ప్రధానమైన భాషల్లో బాక్సాఫీస్ వద్ద లభించిన ఆదరణ, ప్రేక్షకుల ప్రోత్సాహంతో పాటు విమర్శకుల ప్రశంసలు తనని ఆస్కార్ వైపు అడుగులు పడేలా చేశాయి. దీనికి తోడు రాజమౌళికి ఉన్న మార్కెటింగ్ నైపుణ్యం బాగా కలసి వచ్చింది.

అంతే అస్కార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఔపాసన పట్టిన రాజమౌళి పక్కా ప్లాన్‌తో రంగంలోకి దూకాడు. ప్రచారం ముమ్మరం చేశాడు. ఇండియా తరపున ‘ఆర్ఆర్ఆర్’‌కు కాకుండా వేరే సినిమాకి అస్కార్ ఎంట్రీ దక్కినా వెరవలేదు. ఇలాంటిది జరుగుతుందని ముందుగానే ఊహించి తన సినిమా ఆస్కార్ ముంగిట నిలవాలంటే ఏం చేయాలో అది చకచకా చేసుకుంటూ పోయాడు. ఇంత ప్లానింగ్‌తో వ్యవహరించాడు కాబట్టే ఈ రోజు గోల్డెన్ గ్లోబ్ కొట్టి ఆస్కార్ గేటు ముందు నిలుచున్నాడు. ఈ ప్రాసెస్ మొత్తానికి భారీ స్థాయిలో వ్యయం అయింది. ఆ మొత్తంతో మీడియమ్ బడ్జెట్ సినిమా తీయవచ్చు.

Read Also:Waltair Veerayya: అతి మంచితనం కూడా ఒక్కోసారి మంచిదే: చిరంజీవి

ప్రస్తుతం డాలర్ రేటు రూ.81 వరకు ఉంది. అమెరికన్ డాలర్లలో చెప్పాలంటే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ ప్రమోషన్‌కు 6 మిలియన్ డాలర్స్ వరకూ ఖర్చు అయినట్లు అంచనా. అంటే మన ఇండియన్ రూపీస్‌లో చెప్పాలంటే దాదాపు రూ.50 కోట్లు అన్నమాట. భారతీయ భాషల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ కోసం ప్రచారానికి చేసిన ఖర్చు ఓ 20 కోట్ల వరకూ ఉంటుంది. అంటే దానికంటే రెండు రెట్లు అస్కార్ ప్రచారం కోసం ఖర్చు అయింది. అయితే అదే ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ఎంట్రీ సాధించి ఏ కేటగిరిలో అయినా అవార్డ్ సాధిస్తే అది మన యావత్ భారతదేశానికే గర్వకారణం అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఆస్కార్ గెలుచుకున్న మన భారతీయులు ఆంగ్లేయులు నిర్మించిన సినిమాలతోనే అందుకున్నారు. ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అందుకున్నా, రేపు ఆస్కార్ దక్కించుకున్నా అది అరుదైన, చరిత్ర సృష్టించే అంశమే అవుతుంది. మరి అది జరగాలని మన తెలుగువారి సత్తా ప్రపంచం నలుదిశలా వెలిగిపోవాలని కోరుకుందాం.