NTV Telugu Site icon

శ్రీశ్రీ కవిత… ఆధునిక యుగానికి భవిత… 

కవితకు కాదేది అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ.  ఒకప్పుడు కవిత చెప్పాలి అనే, పద్యం రాయాలి అంటే తెలుగు వ్యాకరణం ఆమూలాగ్రం తెలిసి ఉండాలి.  సంస్కృతంపై మంచి పట్టు ఉండాలి.  పండితుల భాషలో చెప్పగలగాలి.  శ్రీశ్రీ వచ్చిన తరువాత కవితకు అర్ధం మార్చేశారు.  అలతి పదాలతో అనర్గళమైన అర్ధాన్ని ఇచ్చే విధంగా కవితలు రాశారు.  పదునైన పదాలతో సూటిగా ప్రశ్నించాడు.  వస్తే రాని పొతే పోనీ అని అంటూ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి వచ్చే కష్టాలను, సుఖాలను పట్టించుకోవద్దని చెప్పాడు.  18 ఏళ్ల వయసులోనే అంటే 1928లోనే ప్రభవ అనే కావ్య సంపుటిని రాశారు.  అప్పట్లో ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.  ఆ తరువాత మధ్యలో అనేక కవితలు, కావ్యాలు రాసినా 1950లో రాసిన మహాప్రస్థానం శ్రీశ్రీని మహాకవిని చేసింది.  అందులోని భిక్షువర్షియసి, బాటసారి, జగన్నాథ రథచక్రాలు కవితలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.  ఆలోచింపజేశాయి.  మరోప్రస్థానం, ఖడ్గసృష్టి వంటివి మంచి పేరు తెచ్చాయి.  కేవలం కవితలకు మాత్రమే పరిమితం కాకుండా శ్రీశ్రీ అల్లూరి సీతారామ రాజు సినిమాలో తెలుగువీర లేవరా అనే పాటను రాశారు.  ఈపాట ఇప్పటికి ఎప్పటికి ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలిచింది.