మ్యూజిక్ డైరెక్టర్ నుండి యాక్టర్ గా మారిన ఎ. ఆర్. రెహ్మాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ ఇప్పుడు ఐదారు సినిమాలు చేస్తున్నాడు. అందులో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ కోవకు చెందిందే ‘బ్యాచిలర్’ మూవీ. గ్రామీణ, పట్టణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేమపిచ్చోడిగా నటిస్తున్నాడు జీవీ ప్రకాశ్ కుమార్. ఈ మూవీతో హీరోయిన్ గా దివ్యభారతి, డైరెక్టర్ గా సతీశ్ సెల్వకుమార్ పరిచయం అవుతున్నారు. గత యేడాది అక్టోబర్ లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ యేడాది ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే కానుకగా టీజర్ ను విడుదల చేశారు. ప్రేమలోని తీవ్రతనే కాదు బ్రేకప్ లోని పెయిన్ ను కూడా ఈ టీజర్ లో చూపించాడు దర్శకుడు. ప్రస్తుతం తమిళనాడులో థియేటర్లన్నీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డాయి. అతి త్వరలో యాభై శాతం ఆక్యుపెన్సీ తో అయినా థియేటర్లు తెరచుకుంటే… మొదటగా ‘బ్యాచిలర్’ మూవీనే రిలీజ్ చేయడానికి నిర్మాత ఢిల్లీ బాబు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు మిస్కిన్ అతిథి పాత్రను పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమారే సంగీతాన్ని అందించాడు. విశేషం ఏమంటే… ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను 2019 సెప్టెంబర్ 19న విడుదల చేశారు. అప్పుడే ఇదో సంచలనం అయిపోయింది. ఈ పోస్టర్ లో అసభ్యత ఉందంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా దర్శక నిర్మాతలను, హీరోని తిట్టిపోశారు. మరి రేపు సినిమా విడుదలైన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి!