Site icon NTV Telugu

Hebah Patel: ‘గీతా’విష్కరణ! సెప్టెంబర్ 9 విడుదల!!

Herba Patel

Herba Patel

గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్. రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘గీత’. ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ శిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఈ చిత్రానికి ఉప శీర్షిక. ఈ సినిమాను ఇదే నెల 26న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు తొలుత భావించారు. అయితే ఇప్పుడది సెప్టెంబర్ 9కి వాయిదా పడింది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్ లోని దసపల్లాలో అత్యంత ఘనంగా జరిగింది. హెబా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా, సాయి కిరణ్ విలన్ గా నటించారు. సుభాష్ ఆనంద్ సంగీత సారథ్యం వహించిన ‘గీత’ చిత్రంలోని గీతాలకు సాగర్ సాహిత్యం సమకూర్చారు. ప్రముఖ ఆడియో సంస్థ టిప్స్ ఈ చిత్రం ఆడియో హక్కులు దక్కించుకుంది.

‘గీత’ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి పి. శివారెడ్డి తనయుడు పి. గిరిధర్ రెడ్డి, ప్రముఖ నిర్మాతలు మల్లిడి సత్యనారాయణరెడ్డి, తుమ్మలపల్లి రామత్యనారాయణ, సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, యువ దర్శకుడు డైమండ్ రత్నబాబు, ప్రియ, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, కెమెరామెన్ క్రాంతికుమార్, డిస్ట్రిబ్యూటర్స్ పొలిశెట్టి, డివిడి విజయ్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. హీరో సునీల్, హీరోయిన్ హెబా పటేల్, జనక్ రాజ్, ప్రియా ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంలో నటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడుగా విశ్వ, నిర్మాతగా రాచయ్యలకు ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు.

Exit mobile version