ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ ఇప్పటికే టాలీవుడ్ లో హీరోగా పలు చిత్రాలలో నటించాడు. ఇప్పుడు సురేశ్ రెండో కుమారుడు గణేశ్ సైతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గణేశ్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ‘స్వాతి ముత్యం’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ ఇందులో హీరోయిన్. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమాను ఆగస్టు 13 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు నిర్మాత సూర్య దేవర నాగవంశీ తెలిపారు. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘స్వాతిముత్యం’ ను దర్శకుడు తీర్చిదిద్దారని అన్నారు.
దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, ”’స్వాతిముత్యం’ లాంటి ఓ యువకుడు కథే ఈ సినిమా. ప్రేమ, పెళ్లి, జీవితం గురించిన ఆలోచనలు, అభిప్రాయాల నడుమ ఆ యువకుడి జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నదే కథ. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలకు పెద్ద పీట వేశాం. ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి” అని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రలను సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద పోషించారు.
విశేషం ఏమంటే… ఈ యేడాది స్వాతంత్రదినోత్సవ కానుకగా ఇప్పటికే ఐదు సినిమాలు విడుదల కాబోతున్నట్టు ప్రకటనలు వచ్చాయి. ఆమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఆ మర్నాడు ఆగస్ట్ 12న అఖిల్ ‘ఏజెంట్’తో పాటు సమంత ‘యశోద’, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’, విశాల్ ‘లాఠీ’ రాబోతున్నాయి. ఇప్పుడు తాజాగా 13వ తేదీన ‘స్వాతి ముత్యం’ను విడుదల చేయబోతున్నట్టు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. మరి ఇందులో ఏ సినిమాలు అనుకున్న విధంగా రిలీజ్ అవుతాయి, ఏవి వాయిదా పడతాయి అనేది వేచి చూడాలి.
