‘వండర్ వుమన్’ స్టార్ గాల్ గాడోట్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు కూడా సెట్స్ లో బెదిరింపుల తిప్పలు తప్పలేదట. సూపర్ హీరో మూవీ ‘జస్టిస్ లీగ్’ దర్శకుడు జాస్ వెడాన్ అసభ్యంగా ప్రవర్తించాడని, సెట్స్‌లో విషపూరిత పని వాతావరణాన్ని సృష్టించాడని, గాల్ గాడోట్ కెరీర్ ను నాశనం చేస్తానని బెదిరించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా గాల్ గాడోట్ ఓ ఇజ్రాయెల్ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ స్పష్టం చేసింది. “జాస్‌తో నాకు సమస్యలు ఉన్నాయి. నేను వాటిని హ్యాండిల్ చేశాను. అతను నా కెరీర్ ను నాశనం చేస్తానని బెదిరించాడు. అయితే నేను దాని గురించి స్పాట్ లో జాగ్రత్తగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది గాల్ గాడోట్. సూపర్ హీరో బ్లాక్ బస్టర్ మూవీ ‘జస్టిస్ లీగ్’ సెట్లో వెడాన్… గాల్ గాడోట్‌తో ఘర్షణకు దిగాడని తెలుస్తోంది. ఇక గాడోట్ ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడడం ఇదే మొదటిసారి.
అయితే సమాచారం ప్రకారం ‘జస్టిస్ లీగ్’కు వెడాన్ దర్శకత్వం వహించడంపై గాడోట్ అసంతృప్తిగా ఉందట. ఇంకా ‘వండర్ వుమన్’లో కంటే ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా అగ్రెసివ్ గా ఉందని, కానీ తన క్యారెక్టర్ సినిమా సినిమాకు ఒక ఫ్లోలో ఉండాలనే విషయం చెప్పడంతో సమస్యలు వచ్చాయట. వెడాన్ వ్రాసిన కొన్ని కొత్త డైలాగ్‌ల దగ్గర గాడోట్, వెడాన్ కు అతిపెద్ద ఘర్షణ జరిగిందట. దీంతో దర్శకుడు వెడాన్ గాడోట్ కెరీర్‌కు హాని చేస్తానని బెదిరించాడట. అంతేకాదు ‘వండర్ వుమన్’ దర్శకుడు పాటీ జెంకిన్స్‌ను కూడా అగౌరవపరిచాడని తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఓ హాలీవుడ్ రిపోర్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘జస్టిస్ లీగ్’ స్టార్ రే ఫిషర్ ఆ చిత్రంలో వెడాన్‌తో కలిసి పని చేస్తున్నప్పుడు తాను ఎదుర్కొన్న సమస్యలను వివరించాడు.