చిత్రసీమలో ట్రెండ్స్ ఎలా మారినా “ఫ్యామిలీ ఆడియన్స్” ఆదరణే సినిమాల విజయానికి అసలైన ప్రాణం. ఈ విషయాన్ని 2026 సంవత్సరం బాక్సాఫీస్ రికార్డులు మరోసారి ఘంటాపథంగా నిరూపించాయి. ఎలాంటి భారీ యాక్షన్ హంగామాలు లేకపోయినా, స్వచ్ఛమైన మానవ సంబంధాలు, చక్కటి వినోదం ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఎలా ఉంటుందో ఈ ఏడాది వచ్చిన పలు చిత్రాల వసూళ్లే నిదర్శనం.
ఫ్యామిలీ డ్రామా మరియు ఎమోషన్‌కు ఆడియన్స్ పట్టం కట్టిన తీరుకు ఈ ఏడాది అతిపెద్ద ఉదాహరణ ‘ఇరుముడి’. కేవలం రూ. 20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ చిన్న సినిమా, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 145 కోట్ల షేర్, రూ. 246 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అలాగే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం రూ. 90 కోట్ల బిజినెస్‌తో బరిలోకి దిగి ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లతో సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోయింది.
ఇక సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల మార్క్‌ను దాటడంలో ఫ్యామిలీ ఆడియెన్సే కీలక పాత్ర పోషించారు. శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాను కూడా ఫ్యామిలీ ప్రేక్షకులు ఆదరించి మంచి విజయాన్ని అందించారు. ఫ్యామిలీ సినిమాలకు ఉన్న ఈ విపరీతమైన ఆదరణను చూసి రాబోయే రోజుల్లోనూ అదే తరహా కథలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పక్కా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ పై మంచి అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న ‘జైలర్ 2’ ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలోనే వస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ భారీ చిత్రాన్ని ఆగస్ట్ 15న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ రన్ చూస్తుంటే 2026లో బాక్సాఫీస్ విజేతగా నిలవాలంటే కంటెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అత్యంత కీలకమని స్పష్టమవుతోంది.

