NTV Telugu Site icon

సినిమాలు లేకపోవడమే అసలు కారణం: విజయేందర్ రెడ్డి

Exhibitor Vijayendar Reddy Comments on theatres bandh in TS

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తర్వాత మళ్ళీ సాలీడ్ మూవీ ఏదీ రిలీజ్ కాలేదు. ఈ తర్వాత రావాల్సిన ‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం’ సినిమాల విడుదల వాయిదా పడిపోయింది. దాంతో ఆరేడు చిన్న సినిమాలు ఈ రెండు వారాల్లో విడుదల అయ్యేందుకు రెడీ అయ్యాయి. కానీ ఆ సినిమాలకు థియేటర్లకు జనాన్ని రప్పించే సత్తా లేదు. అందువల్ల అరకొరా కలెక్షన్లతో థియేటర్లను నడిపే కంటే… మూసివేయడమే బెటర్ అని తెలంగాణ ఎగ్జిబిటర్స్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రముఖ ఎగ్జిబిటర్, విజయేందర్ రెడ్డి సైతం తెలిపారు. ”మంచి సినిమాలు ఉంటే యాభై శాతం ఆక్యుపెన్సీతో అయినా నడపొచ్చు. అలానే తెలంగాణ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ పెట్టినా, రోజుకు మూడు ఆటలతో అయినా నడపొచ్చు. కానీ కొత్త సినిమాలే లేనప్పుడు ఏం చేయాలి?” అనేది ఆయన ప్రశ్న. తెలంగాణాలో రాత్రి కర్వ్యూ పెట్టిన కారణంగా ఫస్ట్ షో లను సాయంత్రం 5.15కే మొదలు పెట్టాలని థియేటర్ల యాజమాన్యం నిర్ణయించుకుంది. ఇదే సమయంలో రేపటి నుండే సినిమా థియేటర్లను మూయకుండా మరో రెండు రోజుల పాటు ప్రదర్శన జరపబోతున్నారు. ‘వకీల్ సాబ్’ ఉన్న థియేటర్లలో ఆటలు కొనసాగుతాయని, తాము సైతం శ్రీ రమణ 35 ఎం.ఎం.ను క్లోజ్ చేసి, శ్రీ రమణ 70 ఎం.ఎం.లో ‘వకీల్ సాబ్’ను మరో రెండు రోజులు ప్రదర్శించబోతున్నామని ఆ థియేటర్ మేనేజర్ నారాయణ రెడ్డి తెలిపారు. థియేటర్ల రద్దు నిర్ణయం ఈ నెలాఖరు వరకే అని ప్రస్తుతం చెబుతున్నా, కొత్త సినిమాల విడుదలకు నిర్మాతలు చొరవ చూపకపోతే… ఇది మరిన్ని వారాల పాటు కొనసాగే ఆస్కారం ఉంటుందని విజయేందర్ రెడ్డి చెబుతున్నారు. నిర్మాతలు మనసు మార్చుకుని, ధైర్యం చేసి 23 నుండి సినిమాలను విడుదల చేస్తే, తామూ ప్రదర్శనకు సిద్ధమన్నది ఆయన మాట!