ED Summons : రామ్మా చిలకమ్మా.. నిధి అగర్వాల్ కు ఈడీ పిలుపు..

Nidhi Agarawal

Nidhi Agarawal

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్ల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) విచారణ మరింత వేగవంతమైంది. ఈ కేసు విచారణలో భాగంగా ప్రముఖ టాలీవుడ్ కథానాయిక నిధి అగర్వాల్‌కు ఈడీ అధికారులు ఇటీవల సమన్లు జారీ చేయగా నేడు బుధవారం ఈడీ కార్యాలయంలో అధికారుల ముందుకు హాజరుకానున్నారు.

గతంలో నమోదైన కేసు ఆధారంగా ఆర్థిక నేరాల కోణంలో ఈడీ ఈ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోంది. అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రచారకర్తగా వ్యవహరించినందుకు గాను నిధి అగర్వాల్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని, ఆ డబ్బును హవాలా రూపంలో పొంది లెక్కల్లో చూపించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమె ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన వివరాలపై ఈడీ అధికారులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. సుమారు 14కు పైగా ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం యాప్‌లకు ప్రచారం కల్పించిన కేసులో పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ పిఎంఎల్‌ఏ (PMLA) చట్టం కింద విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటికే రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత సుభాష్, అనన్య నాగళ్ల వంటి పలువురు ప్రముఖులను అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నిధి అగర్వాల్ అందించే ఆధారాలు, ఇచ్చే స్టేట్‌మెంట్ ఆధారంగా ఈడీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.