భారీ బడ్జెట్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’, కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను సైతం అదే స్థాయిలో ప్రోత్సహిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక బ్యానర్ అండతో వస్తున్న తాజా చిత్రం ‘DNK’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తూ, శ్రీను కంబాల దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమాకు మొదట పెట్టిన టైటిల్, దాని వెనుక జరిగిన సెన్సార్ వివాదం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు దర్శకుడు ముందుగా ‘దొంగ నా కొడకు’ అనే క్యాచీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. కథకు, అందులోని హీరో క్యారెక్టరైజేషన్‌కు ఆ టైటిల్ అయితేనే వంద శాతం న్యాయం చేస్తుందని చిత్రయూనిట్ భావించింది. అయితే సెన్సార్ బోర్డు మాత్రం ఈ టైటిల్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో, చిత్రబృందం వెనక్కి తగ్గి ఆ టైటిల్‌ను కాస్తా ‘DNK’గా మార్చింది. టైటిల్ మారినా, అందులోని అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడా తగ్గలేదని హీరో మౌళి తనూజ్ ప్రశాంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
క్రైమ్ ఎలిమెంట్స్‌కు కామెడీని జోడించి తీసిన ఈ చిత్ర కథాంశం నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అడ్డదారిలో ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశతో గ్యాంబ్లింగ్‌కు బానిసైన ఓ యువకుడు, ఆ తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. ఆ అప్పుల బాధ తట్టుకోలేక ఏకంగా ఓ దొంగతనానికి పాల్పడతాడు. ఈ క్రమంలో అతను ఎలాంటి ఊహించని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? ఆ కష్టాల నుంచి ఎలా బయటపడ్డాడు? అనేదే ఈ ‘DNK’ ప్రధాన కథ. కథలో క్రైమ్ ఉన్నప్పటికీ, మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఈ చిత్రాన్ని మలిచారు. ఇక ఈ సినిమాలో ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చే మరో అంశం ప్రముఖ హాస్యనటుడు ఆలీ పాత్ర. సాధారణంగా కామెడీ రోల్స్ కే పరిమితమయ్యే ఆలీ, ఇందులో ఓ విభిన్నమైన ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆయన ట్రాక్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని చిత్రబృందం చెబుతోంది. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో బబ్లూ అనే పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతోంది.
మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఏపీలో జరిగిన ప్రమోషనల్ టూర్లలో కూడా మూవీ టీమ్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. సింజిత్ అందించిన ఫ్రెష్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇస్తాయని హీరో మౌళి తెలిపారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, సినిమా నిర్మాణ రంగంలో ఉన్న మెళకువలు నేర్చుకోవాలనే ఉత్సాహంతో మౌళి ఈ సినిమా ప్రొడక్షన్ పనుల్లోనూ పాలుపంచుకున్నారు. భవిష్యత్తులో మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించాలనే ఆసక్తి కూడా తనకు ఉందని ఆయన మనసులోని మాటను బయటపెట్టారు. ఏది ఏమైనా.. సెన్సార్ వివాదంతో మొదలైన ఈ ‘DNK’ ప్రయాణం, నవంబర్ 13న థియేటర్లలో నవ్వుల సునామీ సృష్టించడానికి సిద్ధమైంది. ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునే ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి!

