Buchi Babu: రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవిని చూస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. “చిరంజీవి సార్.. నేను మా ఊరు పిఠాపురం నుంచి మీరు ఎప్పటికైనా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారేమో అని లెటర్లు వేసేవాడ్ని. ఆ లెటర్లు మీ దాకా చేరాయో లేదో తెలీదు కానీ, నా మొదటి కథ (ఉప్పెన), ఇప్పుడు నా రెండో పెద్ద కథ (పెద్ది) మాత్రం మీ ఇంటికే వచ్చాయి. ఒక మనిషి సంకల్పం ఉంటే ఎంతవరకు వెళ్లగలడో చెప్పే కథే ఈ ‘పెద్ది’” అంటూ ఎమోషనల్ అయ్యారు.
హీరో రామ్ చరణ్ నటన, క్రమశిక్షణపై బుచ్చిబాబు ప్రశంసల వర్షం కురిపించారు. “ఇలాంటి కథను జనాలు ఇంటికి తీసుకెళ్లాలి అనుకున్నా, చరణ్ సార్ తన పర్ఫార్మెన్స్‌తో దాన్ని నిజం చేశారు. కమర్షియల్ సినిమా చేయడం ఈజీ, కానీ చరణ్ లాంటి స్టార్ హీరో సెకండ్ హాఫ్ మొత్తం తన నటనతోనే నడిపించారు. ఆయన కార్ దిగేటప్పుడు స్టార్‌లా దిగారేమో కానీ, సెట్‌లోకి రాగానే మాత్రం ‘పెద్ది’ క్యారెక్టర్‌లా మారి నడుచుకుంటూ వచ్చారు. నేను ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ చేశారు. చరణ్ సార్‌కి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా” అని పేర్కొన్నారు. తన గురువు సుకుమార్ గురించి చెబుతూ.. “సుకుమార్ గారు లేకపోతే నేను లేను. నన్ను అందరూ డైరెక్టర్ బుచ్చిబాబు అనేదానికన్నా, సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు అని పిలిస్తేనే నాకు ఎక్కువ గౌరవం, విలువ” అంటూ గురుభక్తిని చాటుకున్నారు. అలాగే ప్రొడ్యూసర్ సతీష్ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీశారని, కెమెరామెన్ రత్నవేలు, మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్, ఎడిటర్ నవీన్ నూలిలతో పాటు తన డైరెక్షన్ టీమ్ అంతా ప్రాణం పెట్టి పనిచేసిందని అందరినీ స్టేజ్ పైకి పిలిచి థాంక్స్ చెప్పారు.
సినిమాకు వస్తున్న రెస్పాన్స్ గురించి చెబుతున్నప్పుడు బుచ్చిబాబు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. “మొన్న థియేటర్‌కి వెళ్తే ఒక 75 ఏళ్ల పెద్దాయన నా దగ్గరికి వచ్చారు. ‘బాబు.. 25 ఏళ్ల క్రితం మాతృదేవోభవ సినిమా చూసి ఏడ్చాను, మళ్లీ ఇప్పుడు నీ పెద్ది సినిమా చూసి ఏడ్చాను’ అన్నారు. ఆ మాట వినగానే ఈ జన్మకిది చాలురా అనుకున్నాను. ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను” అంటూ బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు.

