Dil Raju : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 290 కోట్లకు క్లోజ్ అయ్యాయనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో, అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ అంశంపై స్పందించారు. ఒకవేళ తాను ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసేది ఉంటే మొత్తం తెలుగు రాష్ట్రాలు కాకుండా ఓన్లీ నైజాం ఏరియా మాత్రమే చేస్తానని ఆయన తేల్చి చెప్పారు.
సినిమా డిస్ట్రిబ్యూషన్ ఎకనామిక్స్ గురించి మీడియాతో మాట్లాడిన దిల్ రాజును.. ‘వారణాసి’ రైట్స్ రేసులో మీ సంస్థ ఎస్వీసీ (SVC) ఎంతవరకు ఉందంటూ ఓ విలేకరి ప్రశ్నించారు. దీనిపై ఆయన తనదైన శైలిలో బదులిచ్చారు. “రాజమౌళి గారి సినిమాలన్నీ నేను చేయలేదు. ‘బాహుబలి 1’, ‘ఆర్ఆర్ఆర్’ మాత్రమే చేశాను. మధ్యలో ‘బాహుబలి 2’, అంతకుముందు ‘సింహాద్రి’, ‘మగధీర’ లాంటి చిత్రాలు మేము చేయలేదు. నాకంటూ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఏ సినిమా అయినా మనం ఇక్కడి వరకు వెళ్లొచ్చు అని నా బిజినెస్ సెన్స్ నాకు చెప్పాలి. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో నిర్మాత దానయ్య గారి దగ్గరికి వెళ్లి.. ఏమనుకుంటున్నారు అని అడిగి, కేవలం ఐదే ఐదు నిమిషాల్లో షేక్ హ్యాండ్ ఇచ్చి డీల్ క్లోజ్ చేశాం” అని దిల్ రాజు వివరించారు.
ఇక ‘వారణాసి’ బిజినెస్ నంబర్లపై స్పందిస్తూ.. “వారణాసి విషయంలో కూడా నాకు ఆ క్యాలిక్యులేషన్ సెన్స్ తట్టాలి. అలా అనిపించినప్పుడు కచ్చితంగా చేస్తాను. కానీ, అసలు వాళ్లు ఏం నంబర్లు అనుకుంటున్నారు? ఏంటి? అనేది ఇప్పటిదాకా నాకు తెలియదు. మీడియాలో కూడా ఏదో రూ. 290 కోట్లకు డీల్ అయిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి, నేను కూడా చూస్తున్నాను. కానీ, దానిపై మాకు ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు, ప్రస్తుతం ప్రాసెస్‌లోనే ఉంది” అని దిల్ రాజు స్పష్టం చేశారు. అయితే, రూ. 290 కోట్ల భారీ నంబర్‌పై ప్రశ్న ఎదురైనప్పుడు.. తాను మొత్తం తెలుగు రాష్ట్రాలు కాకుండా, ఒకవేళ చేసేది ఉంటే కేవలం నైజాం ఏరియా వరకు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేస్తానని దిల్ రాజు కుండబద్దలు కొట్టారు. మొత్తానికి ‘వారణాసి’ బిజినెస్ లెక్కలపై దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

