ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితో నాగ చైతన్య చేసిన సినిమా తండేల్. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం చైతూ చాలా కష్ట పడ్డాడు. సినిమా మొదలవకముందే శ్రీకాకుళం, వైజాగ్ వెళ్లి అక్కడి వారి జీవన శైలి తెలుసుకుని, వారి యాస భాష నేర్చుకున్నాడు. కార్తికేయ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాస్ నిర్మించారు. లవ్‌స్టోరీ తర్వాత చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. అయితే ముందు ఈ సినిమా కోసం దేవిని తీసుకోవాలా? వద్దా? అనే డైలమాలో పడిపోయాడు అల్లు అరవింద్. ఎందుకంటే అదే సమయంలో పుష్ప2తో బిజీగా ఉన్నాడు దేవి. కాబట్టి తండేల్‌కు వద్దని కాస్త తడబడ్డాడట. ఇదే విషయాన్ని అల్లు అర్జున్‌కి చెప్పగా మరో మాట లేకుండా లవ్‌స్టోరీకి దేవి అయితేనే పర్ఫెక్ట్ అని చెప్పాడట. అక్కడి నుంచి మరో ఆలోచన లేకుండా దేవితో కమిట్ అయ్యామని తండేల్ ప్రమోషన్స్‌లో అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు తండేల్ చూసిన తర్వాత బన్నీ చెప్పిందే కరెక్ట్ అని అనిపిస్తుంది. తండేల్ సినిమా కోసం దేవిశ్రీ సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. మామూలు సీన్‌ను కూడా తనదైన స్కోర్‌తో హైలెట్ చేశాడు. ప్రతి సీన్‌లోను దేవి మార్క్ కనిపిస్తుంది. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో వింటేజ్ దేవిశ్రీ ప్రసాద్ కనిపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తండేల్ సినిమాకి దేవి ప్రాణం పోసాడని చెప్పాలి. తండేల్‌ని అందమైన ప్రేమకథగా మలచడంలో దేవిదే కీలక పాత్ర. ఏదేమైనా బన్నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరోసారి అదరగొట్టాడు దేవిశ్రీ ప్రసాద్.