సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని, ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసిఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ అని తెలియగానే అభిమానులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కేసిఆర్ గారు, కరోనా వైరస్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. మరోవైపు మహేష్ బాబు కూడా సీఎం కేసిఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు. ఇక దేశంలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. ఈ కరోనా మహమ్మారి మాస్క్ ధరించని, జాగ్రత్తలు తీసుకోని ఏ ఒక్కరినీ వదలకుండా విజృంభిస్తోంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా వీలైనంత వరకు సామాజిక దూరం పాటించడం మంచిది.
కేసిఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి… మహేష్, చిరంజీవి ట్వీట్లు
