మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర‘ విడుదలపై ఎట్టకేలకు ఒక స్పష్టత వస్తోంది. గత కొంతకాలంగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మెగా అభిమానుల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయి. తొలుత ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి అనుకున్నా, భారీ గ్రాఫిక్స్ పనుల కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత వేసవి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో అది సాధ్యపడలేదు.
చిత్ర యూనిట్ తాజాగా జూలై 10 ను కొత్త విడుదల తేదీగా పరిశీలిస్తోంది. ఈ తేదీపై అధికారిక ప్రకటన ఇవ్వాలని మేకర్స్ భావించినప్పటికీ రామ్ చరణ్ సినిమా ‘పెద్ది‘ సినిమా విడుదల తేదీతో క్లాష్ అయ్యే అవకాశం ఉండటంతో కొంత వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు ‘పెద్ది’ చిత్రం తన విడుదల తేదీ జూన్ 4 వస్తుండడంతో జూలై 10న ‘విశ్వంభర’ సోలోగా రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. వశిష్ట దర్శకత్వంలో సుమారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత కీలకం కానున్నాయి. గతంలో విడుదలైన గ్లింప్స్‌పై వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చిత్ర యూనిట్ రీ-వర్క్ చేస్తోంది. జూలై నాటికి గ్రాఫిక్స్ పనులు పూర్తవుతాయా లేదా అన్నదే ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక ప్రశ్న. అన్నీ సజావుగా సాగితే 14 లోకాల నేపథ్యంలో సాగే ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని జూలై 10న వెండితెరపై వీక్షించే అవకాశం ఉంటుంది. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
