Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!

Chiru – Odela

Chiru – Odela

Chiru – Odela: మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఏ దర్శకుడికైనా లైఫ్ టైమ్ గోల్డెన్ ఛాన్స్. అలాంటిది ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కథ చెప్పి మెగాస్టార్‌ను మెప్పించడమే కాకుండా, స్వయంగా నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తూ ఆ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించినప్పుడు టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నెత్తురోడుతున్న చేతులతో ‘బ్లడ్ ప్రామిస్’ అంటూ ఇచ్చిన కాన్సెప్ట్ పోస్టర్, “అతడు హింసలో తన శాంతిని వెతుక్కుంటున్నాడు” అన్న ట్యాగ్‌లైన్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. కానీ ఇప్పుడు ఆ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చే అవకాశాలు పూర్తిగా గల్లంతైనట్లే కనిపిస్తున్నాయి. చిరంజీవి సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిన సమయానికే నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ‘ది ప్యారడైజ్’ షూటింగ్ సగం దశలో ఉంది. అయితే తీరా ఆ సినిమా బాక్సాఫీస్ వద్దకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెరపై శ్రీకాంత్ చూపించిన మితిమీరిన హింస, రక్తపాతం ప్రేక్షకులను తీవ్రంగా అసహనానికి గురిచేశాయనే కామెంట్స్ వినిపించాయి. ఈ మధ్యకాలంలో మరే చిత్రానికీ రానంత రేంజ్‌లో నెగెటివ్ టాక్, దారుణమైన ట్రోలింగ్ ఈ చిత్రానికి ఎదురయ్యాయి. నాని మార్కెట్‌కు మించి బడ్జెట్ పెట్టడంతో, సినిమాను రూ. 102 కోట్లకు బిజినెస్ చేశారు. చివరకు తీవ్ర విమర్శల నడుమ రూ. 92 కోట్ల వరకూ రాబట్టి దాదాపు 90 శాతం రికవరీ చేసినప్పటికీ, బ్రేక్ ఈవెన్‌కు రూ. 10 కోట్లు దూరంలో ఆగిపోయి డిజాస్టర్ ముద్ర వేయించుకుంది.

నానితోనే ఇంత వైలెన్స్ ఉంటే, ఇక వింటేజ్ మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవితో శ్రీకాంత్ ఇంకెంత రక్తపుటేర్లు పారిస్తాడోనని మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందడం మొదలుపెట్టారు. తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని చేసిన కామెంట్స్ ఈ ప్రాజెక్ట్ రద్దయిందనే అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. “ది ప్యారడైజ్ ఆలస్యం కాకపోయి ఉంటే, చిరంజీవి-శ్రీకాంత్ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాదే సెట్స్‌పైకి తీసుకెళ్లేవాళ్లం. కానీ ప్యారడైజ్ లేట్ కావడంతో చిరంజీవి గారు ఇతర చిత్రాలకు కమిట్‌మెంట్స్ ఇవ్వాల్సి వచ్చింది” అంటూ నాని చెప్పుకొచ్చారు. కానీ ఇండస్ట్రీ విశ్లేషకులు మాత్రం ఈ మాటల వెనుక అసలు విషయాన్ని వేరేలా చూస్తున్నారు. ప్రాజెక్ట్ ఆగిపోయిందని సూటిగా చెప్పలేక, నాని ఇలా నెమ్మదిగా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ది ప్యారడైజ్’ రిజల్ట్, ఆ సినిమాలో కనిపించిన మితిమీరిన హింస మెగాస్టార్‌ను ఆలోచనలో పడేశాయని, అందుకే చిరు ఈ సినిమాను సైలెంట్‌గా పక్కన పెట్టేశారని అంటున్నారు. బడ్జెట్ లెక్కలు తప్పుకోవడం, కథనంలో అదుపు తప్పిన రక్తపాతం వెరసి శ్రీకాంత్ ఓదెల క్రేజ్‌కు గట్టి బ్రేక్ వేశాయి. చిరంజీవి ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసినట్లే కనిపిస్తుండగా, మరి దర్శకుడిని నమ్మి ఇంత చేసిన నాని అయినా ఆయనకు మరో అవకాశం ఇస్తాడా లేక తానే స్వయంగా దూరం పెడతాడా అన్నది ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.