Case Filed on Bithiri Sathi for Degrading Bhagavadgeetha: సోషల్ మీడియాలో బిత్తిరి సత్తి అనే వ్యక్తి తెలియని వారుండరు. పలు న్యూస్ చానల్స్ లో ఆసక్తికరమైన ప్రోగ్రామ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి ఆ తర్వాత కాలంలో సెలబ్రిటీ యాంకర్ గా మారిపోయాడు. సినీ కార్యక్రమాలను హోస్టింగ్ చేయడమే కాదు సినీ ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాడు. అయితే బిత్తిరి సత్తి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో ఒక ఛానల్ లో పనిచేస్తున్న సమయంలో హిందువులు అత్యంత పవిత్రంగా భావించే భగవద్గీతను అనుసరిస్తూ బిత్తిరి సత్తి ఒక స్కిట్ చేశాడు. భగవద్గీతను బిల్లు గీత అంటూ చేసిన పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో హిందూ సంఘాలు బిత్తిరి సత్తి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Anchor Suma : వివాదంలో యాంకర్ సుమ.. న్యాయం చేయాలంటూ వేడుకోలు!
రాష్ట్రీయ వానరసేన అనే ఒక హిందుత్వ సంస్థ ఈ విషయం మీద బిత్తిరి సత్తి మీద చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భగవద్గీతను అపహాస్యం చేస్తూ బిత్తిరి సత్తి సోషల్ మీడియాలో ఈ వీడియో చేశాడని హిందువులు మనోభావాలు దెబ్బతీసిన ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అయితే రాష్ట్రీయ వానరసేనకు చెందిన ఒక వ్యక్తి బిత్తిరి సత్తికి ఫోన్ చేసి మాట్లాడినట్టు కూడా ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ ఆడియో కానీ వీడియో కానీ ఎక్కడడా అందుబాటులో లేదు. వానర సేన సభ్యులు చెబుతున్నదాని ప్రకారం ఫోన్ చేసి వివరణ అడిగితే తాను కూడా హిందువునేనని ఈ వీడియో వేలమందికి నచ్చింది మీకు నచ్చకపోతే నేనేం చేయాలి? ఏమైనా ఉంటే కేసు పెట్టుకోమని బిత్తిరి సత్తి చెప్పినట్లుగా వాళ్ళు చెబుతున్నారు. ఈ క్రమంలోని బిత్తిరి సత్తి క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే బిత్తిరి సత్తి క్షమాపణ చెబుతాడా లేదా అనేది చూడాల్సి ఉంది.