Nagarjuna’s King 100 Movie: ‘అక్కినేని’ కుటుంబంలో వరుస మూవీ విజయాలతో సందడి నెలకొంది. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ చైతన్య, అఖిల్ ఇటీవల విజయాలు అందుకోవడంతో.. అక్కినేని అభిమానుల్లో జోష్ వచ్చింది. ‘తండేల్’తో చై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోగా.. ‘లెనిన్’తో అఖిల్ ట్రాక్‌లోకి వచ్చారు. ఈ విజయాలతో అక్కినేని హీరోలపై అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో చైతన్య, కింగ్ నాగార్జున బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే తండ్రీకొడుకులు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
నాగ చైతన్య ‘వృషకర్మ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైథలాజికల్ ఫాంటసీ, అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. తండేల్ విజయంతో ఊపుమీదున్న చై.. వృషకర్మతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని చూస్తున్నారు.
మరోవైపు నాగార్జున కూడా తన మైలురాయి చిత్రం ‘కింగ్ 100’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల ‘కూలీ’, ‘కుబేర’ వంటి సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించిన నాగ్.. ఈసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా రూపొందుతోంది. డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. చై వృషకర్మ విడుదలైన 20 రోజులకే కింగ్ 100 థియేటర్లలోకి రానుండటంతో అక్కినేని అభిమానులకు డిసెంబర్ నెల ప్రత్యేకంగా మారనుంది.
ఇప్పటికే నాగ చైతన్య, అఖిల్ తమ సినిమాలతో వంద కోట్ల మార్కును అందుకున్నారు. ఇప్పటివరకు వరకు నాగార్జున తన కెరీర్లో వంద కోట్ల మార్కును టచ్ చేయలేదు. కొడుకులు ఎచీవ్ చేసిన వంద కోట్ల ఫీట్‌ను కింగ్ కొట్టాలని చుస్తున్నారు. ‘కింగ్ 100’ భారీ వసూళ్లు సాధించాలని అక్కినేని ఫాన్స్ కోరుకుంటున్నారు. తండ్రీకొడుకుల సినిమాలు వరుసగా విడుదలవుతుండటంతో అక్కినేని అభిమానులు ఈ రెండు చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. మరి వృషకర్మ, కింగ్ 100 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.

