బన్నీ వాసు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బన్నీ అనుచరుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, ప్రస్తుతానికి ఒక నిర్మాతగా మారారు. సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకుని సినిమాలు నిర్మించడం కూడా మొదలుపెట్టారు. అందులో భాగంగా, ‘మిత్రమండలి’ అనే సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో, ఆయన ఎన్టీవీతో ప్రత్యేకంగా ఒక పాడ్‌కాస్ట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఉదయ శ్రీనివాస్ బన్నీ వాసుగా ఎలా మారాడు అనే విషయం గురించి మాట్లాడుతూ, తనను అల్లు అరవింద్ గారు ‘ఆర్య’ సినిమా కోసం రంగంలోకి దించినట్లు వెల్లడించారు.
Also Read:Rahul Ramakrishna : నేను ఒక చిన్న నటుడిని.. పాలన గురించి నాకేం తెలుసు?
అల్లు అర్జున్‌కి, దిల్ రాజుకి ఈ మధ్య కోఆర్డినేషన్ చేసుకోవడం కోసం నన్ను అక్కడ నియమించారని ఆయన అన్నారు. అయితే, అదే సమయంలో అక్కడ వాసు వర్మ కూడా అదే సినిమాకి పనిచేస్తూ ఉండేవాడు. నన్ను కూడా ‘వాసు’ అనే ఎక్కువగా పిలిచేవారు. ఇద్దరు వాసులను గుర్తుపట్టడం ఈజీగా ఉంటుందని, దిల్ రాజు ముందుగా నన్ను ‘బన్నీ వాసు’ అని పిలవడం మొదలుపెట్టాడు. సుకుమార్ కూడా ఇదే ఈజీగా ఉందని నన్ను ‘బన్నీ వాసు’ అని పిలవడం మొదలుపెట్టాడు. అలా నా సొంత పేరైన ఉదయ శ్రీనివాస్‌ను పక్కనపెట్టి, అందరూ నన్ను ‘బన్నీ వాసు’ అని పిలవడం మొదలుపెట్టారని ఆయన అన్నాడు. ‘ఆర్య’ సినిమాకి తన పేరు ఉదయ శ్రీనివాస్ అనే క్రెడిట్‌లో వేశారని, కానీ తర్వాత తనను ‘బన్నీ వాసు’గానే అందరూ గుర్తుపెట్టుకున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. అలా పిలవడమే తనకు ఆనందమని ఆయన అన్నారు.
