సీనియర్ నటుడు, గోపీకృష్ణ మూవీస్ అధినేత, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రముఖ హాస్య నటుడు, గిన్నిస్ బుక్ విజేత బ్రహ్మనందం ఇటీవల ఓ ఆధ్యాత్మిక బహుమతిని ఆయన ఇంటికి వెళ్ళి స్వయంగా అందించారు. కేంద్రమంత్రిగానూ గతంలో బాధ్యతలను నిర్వర్తించిన కృష్ణంరాజు. సాయిబాబా భక్తులు. ఆయన తన కుమార్తెలకు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి అని బాబా పేరు కలిసి వచ్చేలా పెట్టారు. కృష్ణంరాజులోని ఆ ఆధ్యాత్మిక కోణాన్ని గుర్తించిన బ్రహ్మానందం కరోనా సమయంలో తాను వేసిన షిర్డీ సాయిబాబా పెన్సిల్ డ్రాయింగ్ ను ఫ్రేమ్ కట్టించి, కృష్ణంరాజుకు అందచేశారు. బ్రహ్మానందం బహుమతితో మురిసిపోయిన కృష్ణంరాజు ఆయనను శాలువతో సత్కరించారు.
కృష్ణంరాజుతో పలు చిత్రాలలోనూ నటించిన బ్రహ్మానందం ఆయన గొప్పతనాన్ని మరోమారు గుర్తు చేసుకున్నారు. ఎదుటివ్యక్తిని గౌరవించే గొప్ప సంస్కారి కృష్ణంరాజు అని చెబుతూ, “నేను ఎప్పుడు ఆయనను కలిసినా, సరస్వతీ దేవిని చూసినట్టు ఉంటుందని కృష్ణంరాజు గారు చెబుతుంటారు. మొన్న సాయిబాబా చిత్రపటాన్ని అందించడానికి వెళ్ళినప్పుడు సైతం అదే ఆదరణను చూపుతూ, ఆ సంస్కారం తనకు తన తండ్రినుండి అబ్బిందని కృష్ణంరాజు గారు చెప్పడం గొప్ప ఆనందాన్ని కలిగించింది. అలాంటి లివింగ్ లెజెండ్ కు నేను గీసిన షిర్డీ సాయినాధుని బొమ్మను ఇవ్వడం సంతోషంగా అనిపించింది” అని అన్నారు.
బ్రహ్మానందం తనకు ఇచ్చిన సాయిబాబా చిత్రపటాన్ని, ఆ సందర్భంగా బ్రహ్మానందాన్ని సత్కరించిన ఫోటోను కృష్ణంరాజు శనివారం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘కామెడీ జీనియస్ బ్రహ్మానందం ఆర్ట్ జీనియస్ కూడా! అద్భుతమైన ప్రతిభ ఉన్న అందమైన వ్యక్తి ఆయన. బ్రహ్మానందం ఇచ్చిన స్వీట్ సర్ ప్రైజ్ కు ధన్యవాదాలు’ అంటూ ‘గాడ్ బ్లస్ యూ బ్రహ్మానందం’ అని ఆశీర్వదించారు రెబల్ స్టార్!!
