Krishnam Bhaje: మార్కండేయుడిగా బ్రహ్మాజీ.. ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ అవుట్!

Krishnam Bhaje

Krishnam Bhaje

టాలీవుడ్‌లో దశాబ్దాలుగా తనదైన విలక్షణ నటనతో, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ నటుడు బ్రహ్మాజీ.. ఇప్పుడు ఎవరూ ఊహించని పూర్తి భిన్నమైన ఆధ్యాత్మిక అవతారంలోకి మారిపోయారు. జయశ్రీ మీడియా సమర్పణలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’లో ఆయన పవర్ ఫుల్ ‘మార్కండేయ’ పాత్రను పోషిస్తున్నారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాలోని బ్రహ్మాజీ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియా వేదికగా మేకర్స్ లాంచ్ చేశారు. ఈ పోస్టర్‌లో బ్రహ్మాజీ గెటప్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. కాషాయ వస్త్రాలు ధరించి, మెడలో రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి, చేతిలో ఆయుధంతో ఎంతో ఉగ్రంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉన్న ఆయన మార్కండేయుడి లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక భక్తిరస చిత్రంలో బ్రహ్మాజీ లాంటి విలక్షణ నటుడు ఈ స్థాయి మేకోవర్ అవ్వడం ప్రాజెక్ట్‌పై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పౌరాణిక, భక్తిరస అంశాల మేళవింపుగా రూపొందుతున్న ఈ చిత్రానికి నాగరాజ్ కొట్టే కథను అందిస్తూ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కలాల్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో ప్రదీష్ హీరోగా, వంగమయి పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కథకు అనుగుణంగా ఇందులో ప్రత్యేకమైన పాత్రలు, ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండబోతున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ సినిమాలో మురళీ గౌడ్, అభయ్ బెతిగంటి, గౌతమ్ రాజు, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశేషం ఏంటంటే, ప్రముఖ కమెడియన్ రచ్చ రవి ఇందులో ఓ కీలక పాత్రలో నటించడమే కాకుండా ఈ సినిమాకు సంభాషణలు (డైలాగ్స్) కూడా సమకూరుస్తున్నారు. శ్రీరాం గుప్త సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మంథెన త్రినాథ్, సత్య సొమేష్ సంగీతం అందిస్తున్నారు. రాము సి.ఎం, సూర్య మీసాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. అతి త్వరలోనే ఈ భక్తిరస చిత్రానికి సంబంధించిన టీజర్, ఇతర ప్రచార చిత్రాలను గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.