బాలీవుడ్ కి చెందిన ఒక దర్శక నిర్మాతని లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలపై ముంబైలోని మాల్వానీ పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా మేధా ప్రాంతంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో దాక్కున్న షకీల్ నూరానీని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈయన గతంలో ‘బడే దిల్ వాలా’ (1999), ‘జోరు కా గులామ్’ (2000) వంటి సినిమాలను తెరకెక్కించారు. బాధిత నటి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం… 2016లో లోఖండ్‌వాలాలో జరిగిన ఒక అవార్డుల వేడుకలో షకీల్ నూరానీతో పరిచయం ఏర్పడింది. కొత్త సినిమా స్క్రిప్ట్ చర్చల నెపంతో నటిని తన మాల్వానీ నివాసానికి ఆహ్వానించిన ఆయన, డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహతప్పేలా చేశారు. ఆపై ఆమెపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశారు.
ఈ వీడియోలను నెట్‌లో పెడతానని భయపెడుతూ, పోలీసులకు లేదా కుటుంబ సభ్యులకు చెప్పకుండా చాలాసార్లు, ఆమెపై వేధింపులకు పాల్పడ్డారని FIRలో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ క్రమంలో తనకు బలవంతంగా గర్భనిరోధక మాత్రలు కూడా ఇచ్చినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపుల వల్ల తీవ్ర శారీరక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న నటి, చికిత్స కోసం ఆర్థిక సాయం కోరుతూ 2026లో తిరిగి ముంబై వచ్చి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై మాల్వానీ పోలీసులు (BNS) సెక్షన్లు 64(2)(M), 123, 351(2), మరియు 88 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మరింత లోతైన విచారణ జరిపేందుకు, ఇతర ప్రదేశాల్లో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలో ఆరా తీసేందుకు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీనిపై విచారించిన బోరివలి హాలిడే కోర్టు షకీల్ నూరానీకి ఆగస్టు 12 వరకు పోలీస్ కస్టడీ విధించింది. మరోవైపు, నూరానీ న్యాయవాది వికాస్ సింగ్ గోర్ ఈ ఆరోపణలను ఖండించారు. తన క్లయింట్‌ను ఈ కేసులో కావాలనే ఇరికించారని, కోర్టులో నేరం రుజువయ్యే వరకు ఆయన నిరపరాధి అని అంటున్నారు.

