మోస్ట్ అవైటెడ్ సూపర్ హీరో మూవీ “బ్లాక్ పాంథర్” సీక్వెల్ పనులు పారంభమయ్యాయి. ‘బ్లాక్ పాంథర్ : వకాండా ఫరెవర్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రారంభమైనట్టు అధికారికంగా వెల్లడించారు. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ కెవిన్ ఫెయిజ్ మంగళవారం నుంచి ‘బ్లాక్ పాంథర్ : వకాండా ఫరెవర్’ షూటింగ్ అట్లాంటాలోని పైన్ వుడ్ స్టూడియోలో ప్రారంభమైనట్టు ప్రకటించారు. గతంలో ‘బ్లాక్ పాంథర్’లో హీరో రోల్ పోషించిన దివంగత నటుడు చాడ్విక్ బోస్మాన్ తప్ప మిగిలిన తారాగణమంతా ఇందులో తిరిగి నటించనుంది. బోస్మాన్ నాలుగు సంవత్సరాలు పెద్దప్రేగు కాన్సర్ తో పోరాడి చివరకు 2020 ఆగస్టులో కన్నుమూశారు. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ లో ఆయన పాత్రలో ఎవరు నటించనున్నారో మాత్రం సస్పెన్స్ గా ఉంది.
Read Also : యూఎస్ నుంచి తిరిగొచ్చిన ధనుష్.. నెక్స్ట్ అదే పని…!
మొదటి భాగానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ ర్యాన్ కూగ్లర్ సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహించనున్నారు. ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ జూలై 8, 2022న రిలీజ్ కానుంది. కాగా ‘బ్లాక్ పాంథర్’ సిరీస్ ఫస్ట్ పార్ట్ ఫిబ్రవరి 2018లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.34 బిలియన్ డాలర్లు సంపాదించింది. ‘ఎవెంజర్స్’ కాకుండా మార్వెల్ కు అత్యధిక వసూళ్లు తెచ్చిపెట్టిన మూవీగా ‘బ్లాక్ పాంథర్’ నిలిచింది. ఈ చిత్రం ఏడు విభాగాల్లో అకాడమీ అవార్డుకు నామినేట్ కాగా, బ్యాక్ గ్రౌండ్ స్కోరు, కాస్ట్యూమ్ డిజైన్, ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీల్లో ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది.
