NTV Telugu Site icon

Bigg boss 6: మూడో కెప్టెన్ గా బిగ్ బాస్ రివ్యూవర్!

Big Boss 6

Big Boss 6

Bigg boss 6: బిగ్ బాస్ 6 షోలో సినిమా, టీవీ నటీనటులతో పాటు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ కూ చోటు దక్కింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఆదిరెడ్డి. ‘బిగ్ బాస్ షో’ రివ్యూవర్స్ గా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి, యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతగా అంటే… చివరకు అదే షో నుండి తనకు ఆహ్వానం అందేంత! చిత్తశుద్థితో ఓ పని చేసుకుంటూ వెళితే ఎప్పుడో కప్పుడు గుర్తింపు ఖచ్చితంగా వస్తుందని ఆదిరెడ్డి నిరూపించాడు. బిగ్ బాస్‌ హౌస్ లోని ఈ టాలెస్ట్ మెన్ ఇప్పుడు మూడో కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం ‘అడవిలో ఆట’ అనే గేమ్ ను నిర్వహించారు. మూడు రోజుల పాటు పోలీసులు, దొంగలు, గీతూ లాంటి స్వార్థ వ్యాపారస్థురాలు మధ్య సాగిన రచ్చలో చివరకు కెప్టెన్సీ పోటీలో శ్రీసత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి నిలిచారు. ఈ ముగ్గురిలో ఫైనల్ టాస్క్ లో ఆదిరెడ్డి విజయం సాధించి, ఈ హౌస్ లో మూడో కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా అతనితో పాటు బాల్కనీ యాక్సెస్ కు మరో ఇద్దరిని బిగ్ బాస్ ఎంపిక చేసుకోమన్నాడు. అక్కడ తెలివిగా… కంటెస్టెంట్స్ లో ఒకరిగానే పరిగణిస్తున్న రోహిత్-మెరీనాతో పాటు ఆదిరెడ్డి చలాకీ చంటిని ఎంపిక చేసుకున్నాడు.

శుక్రవారం బిగ్ బాస్ హౌస్ లో మరో పేలవమైన పోటీ జరిగింది. అరవై నిమిషాల పాటు ప్రసారం చేసే ఈ కార్యక్రమంలో కనీసం పది నిమిషాలు, ఏడు నిమిషాలు, ఐదు నిమిషాలు, ఒకటిన్నర నిమిషాలు తమని చూపించే ఆస్కారం ఎవరెవరికి ఉందో ఇంటి సభ్యులను చెప్పమని బిగ్ బాస్ కోరాడు. అందులో 10 నిమిషాలు కంటెంట్ లో గీతూ, ఆ తర్వాత కేటగిరిల్లో రేవంత్, ఫైమా, చంటి, వాసంతి వచ్చారు. జీరో ప్రసారం జాబితాలో నిలిచిన కీర్తి భట్, అర్జున్, ఆరోహిలలో ఒకరిని జైలుకు పంపమని బిగ్ బాస్ ఆదేశించాడు. దాంతో ఎవరికి వారు తామే జైలుకు వెళతామని పోటీ పడ్డారు. అయితే ఫైనల్ గా తను జైలుకు వెళ్ళడమే కరెక్ట్ అని భావించిన అర్జున్ మిగిలిన ఇద్దరినీ ఒప్పించాడు. శని, ఆదివారాలలో ఎలిమినేషన్ ఉండటంతో నామినేషన్స్ లో ఉన్న వ్యూవర్స్ సానుభూతి కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కీర్తి భట్ నీటి కుళాయి ఓపెన్ చేసినట్టుగా కన్నీరు మున్నీరు అవుతుంటే, అర్థరాత్రి కిచెన్ లోనూ, స్టోర్ రూమ్ లోనూ ఆర్జే సూర్య, ఆరోహి స్నేహ పరిమళాలను గుబాళింప చేస్తున్నారు. కుదిరితే కప్పు కాఫీ… వీలైతే కొన్ని చిప్స్ అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం సాగుతోంది. అయితే నామినేషన్స్ లో ఉన్న తొమ్మిది మందిలో శనివారం రేవంత్, బాలాదిత్య, శ్రీహాన్ సేఫ్ జోన్ లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది!