NTV Telugu Site icon

భానుమతి రామకృష్ణ బహుముఖ ప్రజ్ఞాశాలి

Bhanumathi Ramakrishna Birthday Special

Bhanumathi Ramakrishna Birthday Special

(సెప్టెంబర్ 7న భానుమతి జయంతి)

సాటిలేని మేటి నటి భానుమతి రామకృష్ణ పేరు తలచుకోగానే ముందుగా ఆమె బహుముఖ ప్రజ్ఞ మన మదిలో మెదలుతుంది… నటిగా, గాయనిగా, నర్తకిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా భానుమతి సాగిన తీరు అనితర సాధ్యం… సెప్టెంబర్ 7న భానుమతి జయంతి… ఈ సందర్భంగా భానుమతి బహుముఖ ప్రజ్ఞను మననం చేసుకుందాం…

నటిగానే కాదు గాయనిగానూ భానుమతి బాణీ విలక్షణమైనది… ఆమె గానం నిజంగానే తెలుగువారి మనసుల్లో మల్లెల మాలలు ఊగించింది… వెన్నెల డోలల్లో తేలించింది… భానుమతి గాత్రంలో జాలువారిన గానం వింటూ ఉంటే ఎంత హాయి!… వయసు మీద పడినా, భానుమతి గాత్రంలో ఏ మాత్రం తొణుకు బెణుకూ కనిపించలేదు… తరాలు మారినా, తన గానంలోని మాధుర్యం ఏమీ తరగలేదని నిరూపిస్తూ భానుమతి నటిగా, గాయనిగా సాగారు… మాతృభాష తెలుగులోనే కాదు, ఏ భాషలోనైనా, అభినయంతో పాటు గానంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ  సాగారు భానుమతి… నవతరం నటీమణులతో పోటీ పడి నటించడంలోనే కాదు, గాయనీమణులకూ దీటుగా గళం విప్పేవారు. భానుమతి నటనలో ‘అతి’ కనిపిస్తుందని కొందరి మాట…  కానీ, అది అతికినట్టుగా ఉంటుందని అధికుల అభిప్రాయం… ఏది ఏమైనా కొన్ని పాత్రలు ఆమెను వెదుక్కుంటూ వెళ్ళాయి… వాటిలో భానుమతి జీవించిన తీరు అనితరసాధ్యం అని చెప్పక తప్పదు…

భానుమతి అంటే ఎంతో మందికి హడల్… ఆమె తరం నటీమణులు భానుమతితో నటించడానికే జంకేవారు… మహానటిగా ఎంతో పేరు సంపాదించిన సావిత్రి సైతం భానుమతితో ఒకే ఒక్క తమిళ చిత్రంలో నటించారంటే ఆ రోజుల్లో ఆమె ధాటి ఎలా ఉండేదో వేరే చెప్పాలా!? కానీ, నిజానికి భానుమతి గంభీరంగా కనిపించినా సున్నిత మనస్కురాలు అని కొందరికే తెలుసు… అందుకే నవతరం నటీమణులు ఆమె సరసన నటించడానికి ఉరకలు వేసి, తమ ప్రతిభను చాటుకున్నారు. భానుమతి మనసు తెలుసుకున్న తరువాత ఎంతోమంది తారలు ఆమెతో మళ్ళీ మళ్ళీ నటించడానికీ ఉత్సాహం చూపించారు… తరువాతి రోజుల్లో వారు మహానటీమణులుగా వెలుగు చూడటానికి భానుమతితో కలసి నటించడం ఎంతగానో ఉపకరించిందనీ చెప్పుకున్నారు…

కొందరు దర్శకులయితే భానుమతి తమ చిత్రంలో నటిస్తే చాలు అని అభిలషించేవారు… అలాంటి వారు పనికట్టుకొని మరీ ఆమె కోసం కొన్ని పాత్రలు సృష్టించేవారు… ఆ పాత్రలకు భానుమతి మరింత నిండుతనం సంపాదించి పెట్టారని చెప్పవచ్చు. నటరత్న యన్టీఆర్ తన తనయుడు బాలకృష్ణను తొలిసారి నటింపచేస్తూ, భానుమతి కాంబినేషన్ లోనే సీన్ చిత్రీకరించారు… బాలయ్య తొలి చిత్రం ‘తాతమ్మకల’ చిత్రానికి యన్టీఆర్ నటించి, దర్వకత్వం వహించారు… అందులో బాలయ్యకు భానుమతి తాతమ్మగా నటించారు…  దీనిని బట్టే కొన్ని పాత్రలకు భానుమతి మాత్రమే న్యాయం చేయగలరన్న విషయం తేటతెల్లమవుతోంది… ఇక తొలి చిత్రంలోనే భానుమతి ఆశీస్సులు అందుకున్న బాలకృష్ణ ఈ నాటికీ స్టార్ హీరోగా సాగుతూనే ఉండడం తెలిసిందే! భానుమతి అభినయ పర్వంలో ఎంతోమంది నటులు ఆమె సరసన నటించి, టాప్ స్టార్స్ గా వెలుగొందారు… ఆ రోజుల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతితో కలసి నటించడాన్ని ఆ మేటి నటులు సైతం గౌరవంగా భావించేవారు… అదీ భానుమతి నటనా మహత్యం…

తెలుగువారి తొలి స్టార్ హీరో అని సిహెచ్. నారాయ‌ణ రావును పేర్కొంటారు. ఆయ‌న‌కు అంత‌టి స్టార్ డ‌మ్ రావ‌డానికి నాగ‌య్య హీరోగా రూపొందిన స్వ‌ర్గ‌సీమ‌ కార‌ణం. అందులో సిహెచ్. నారాయ‌ణ రావుతో భానుమ‌తి జోడీ క‌ట్టి అల‌రించారు. ఆయ‌న విల‌న్ వేషం, ఈమె వ్యాంప్ రోల్ లో న‌టించినా స్వ‌ర్గ‌సీమ వారిద్ద‌రికీ మంచి పేరు ల‌భించింది. ఆ సినిమా త‌రువాతే సిహెచ్. నారాయ‌ణ రావుకు ఎంతో పేరుప్ర‌తిష్ఠ‌లు ల‌భించాయి.

అంద‌రూ ఏయ‌న్నార్ ను ట్రాజెడీ కింగ్ గా నిలిపిన చిత్రం దేవ‌దాసు లంటూ ఉంటారు. అయితే ఆయ‌న‌లో భ‌గ్న‌ప్రేమికునిగా న‌టించగ‌ల న‌ట‌న‌ ఉంద‌ని ముందుగా గ్ర‌హించింది భానుమ‌తి రామ‌కృష్ణ‌నే. త‌మ భ‌ర‌ణీ పిక్చ‌ర్స్ ప‌తాకంపై త‌న భ‌ర్త రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన లైలా-మ‌జ్ను చిత్రంలో ఏయ‌న్నార్ ను మ‌జ్నుగా ఎంచుకున్నారు. అప్ప‌ట్లో ఎంతోమంది ఏయ‌న్నార్ ఇంకా ప‌రిపక్వం చెంద‌ని న‌టుడు మ‌జ్నుగా అత‌ను రాణించ‌లేడ‌నీ చెప్పారు. అయితే భానుమ‌తి, అక్కినేని అభిన‌యంపై న‌మ్మ‌కంతోనే మ‌జ్నుగా ఆయ‌న‌ను ఎంచుకున్నారు. లైలాగా త‌న‌దైన అభిన‌యంతో భానుమ‌తి అల‌రించారు. అలా ఏయ‌న్నార్ భ‌గ్న‌ప్రేమికునిగా న‌టించ‌డానికి భానుమ‌తి కార‌కురాల‌య్యారు.

ఎమ్.జి.రామ‌చంద్ర‌న్ చిత్ర‌సీమ‌లో ఎప్ప‌టి నుంచో ఉన్నా, ఆయ‌న‌కు సరైన స్టార్ డ‌మ్ ల‌భించ‌డానికి పుష్కర‌కాలం ప‌ట్టింది. భానుమ‌తితో క‌ల‌సి ఎమ్జీఆర్ మ‌లైక్క‌ల్ల‌న్ అనే చిత్రంలో న‌టించారు. ఆ స‌మ‌యంలో ఎమ్జీఆర్ చేయి చూసిన భానుమ‌తి మీకు రాజ‌యోగం ఉందండి అని జోస్యం చెప్పారు. అందుకు ఎమ్జీఆర్ మీతో న‌టించ‌డ‌మే ఓ రాజ‌యోగం అమ్మా…అని అన్నార‌ట‌. చూస్తూ ఉండండి నా మాట నిజం అవుతుందో లేదో అని భానుమ‌తి బ‌ల్ల‌గుద్ది చెప్పార‌ట‌. అలాగే ఎమ్జీఆర్ భానుమ‌తితో న‌టించిన ఆలీబాబావుమ్ న‌ల‌వ‌త్తు తిరుడ‌గ‌ళ్ చిత్రం తొలి త‌మిళ రంగుల సినిమాగా రూపొంది అఖండ విజ‌యం సాధించింది. అప్పుడు మ‌రోమారు త‌న జోస్యం గుర్తు చేశార‌ట భానుమ‌తి. త‌రువాతి కాలంలో నిజంగానే ఎమ్జీఆర్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కాగ‌లిగారు.

య‌న్టీఆర్, భానుమ‌తి క‌ల‌సి అనేక చిత్రాల‌లో న‌టించినా, వారిద్ద‌రి జోడీ అన‌గానే మ‌ల్లీశ్వ‌రి చిత్ర‌మే ముందుగా గుర్తుకు వ‌స్తుంది. భానుమ‌తి ద‌ర్శ‌క‌త్వంలో య‌న్టీఆర్, అలాగే ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ఆమె న‌టించారు. రామారావు ఠీవిగా న‌డిచే విధానం చూసి ఏదో ఒక రోజున రాజ్య‌మేలుతారు అంటూ ఆయ‌న‌కూ భానుమ‌తి జోస్యం చెప్పార‌ట‌. ఆ మాట కూడా నిజ‌మ‌యింది  క‌దా!

భానుమతి అనగానే ఆమె అభినయంతో పాటు గానం కూడా గుర్తుకు వస్తుంది… అంతేనా! నిర్మాత‌గానూ, ద‌ర్శ‌కురాలిగానూ భానుమ‌తి త‌న‌దైన బాణీ ప‌లికించారు. ఆ ముచ్చట తలచుకున్నా అబ్బుర పడాల్సిందే!
భానుమతి భర్త పి.రామకృష్ణ దర్శకులుగా సుప్రసిద్ధులు… తొలి నుంచీ తన ప్రతిభను చాటుకొనేందుకు తపించే భానుమతి ‘చండీరాణి’ చిత్రంతో తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించారు… చిత్రమేమిటంటే, తొలిసారి దర్శకత్వం వహిస్తూనే ‘చండీరాణి’ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించారు… అంతేకాదు, అందులో ద్విపాత్రాభినయమూ చేయడం విశేషం… అంతటితో ఆగితే ఆమె భానుమతి ఎందుకవుతారు? ఆ చిత్రానికి సుబ్బరామన్ సంగీతం సమకూర్చినా, భానుమతి సంగీత పర్యవేక్షణ చేశారు… ఈ సినిమా మూడు భాషల్లోనూ శతదినోత్సవం చూడడం విశేషం…

తెలుగులో అందరూ బాలలతోనే రూపొందిన చిత్రాలు కొన్నే… వాటిలో ముందుగా భానుమతి దర్శకత్వంలో రూపొందిన ‘భక్త ధ్రువ మార్కండేయ’ చిత్రాన్ని మననం చేసుకోవాలి… ఈ సినిమాలో నటించిన వారు శోభన, రోహిణి వంటి వారు తరువాతి రోజుల్లో నాయికలుగానూ నటించారు… ఇప్పటికీ తమ దరికి చేరిన పాత్రల్లో వారు అలరిస్తూనే ఉండడం విశేషం.. గాయ‌నిగా భానుమతి పాట‌లంటే ఈ నాటికీ చెవి కోసుకొనే వారు ఎంద‌రో ఉన్నారు… ఆమె కేవలం సినిమా పాటలతోనే కాలక్షేపం చేయలేదు… సంగీతసాధన చేసి, శాస్త్రీయ సంగీతాన్ని సైతం ఎంతో మాధుర్యంగా గానం చేసి మురిపించారు… ఆ పాటలు వింటూ  ఈ నాటికీ సంగీతాభిమానులు పరవశించి పోతూనే ఉన్నారు…

మారుతున్న కాలానికి అనువుగా తన గాత్రాన్ని సవరించుకొని మరీ మురిపించారు భానుమతి… ఆమె గళంలో జాలువారిన అనేక గీతాలు భావి సంగీతకళాకారులకు పాఠ్యాంశాలుగా సాగుతున్నాయి… దీనిని బట్టే భానుమతి గానవైభవం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు… శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామి భక్తురాలు భానుమ‌తి…. ఆ స్వామి వారిని కీర్తిస్తూ గానం చేయడంలో భానుమతి మైమరచిపోయేవారు… అలాగే భానుమ‌తి గ‌ళం నుండి జాలువారిన అనేక భ‌క్తి గీతాలు జ‌నాన్ని భ‌క్తిపార‌వ‌శ్యంలో ముంచెత్తాయి…

శ్రీమహావిష్ణువు అంటే భానుమతికి అమిత భక్తిప్రపత్తులు … ఆయన అవతారాలతో సాగే ఏ గీతాన్ని పాడినా అందులో భక్తిభావం తొణికిసలాడేది… వీనులకు విందు చేస్తూ విన్నవారిలో భక్తిరసాన్ని పెంపొందించేలా భానుమతి గానం సాగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి… తాను శ్రీవేంకటేశ్వర స్వామి భక్తురాలే అయినా, తన దరికి చేరిన ఏ భక్తి గీతాన్నైనా ప్రాణం పెట్టి పాడేవారు భానుమతి… శ్రీనివాసుని కీర్తనలనే కాదు, శివుని గీతాలనూ అంతే భక్తిశ్రద్ధలతో గానం  చేసి అలరించారు భానుమతి…

అయ్యవారి పాటలే కాదు, అమ్మవారి గీతాలనూ భానుమతి పాడిన తీరు మరపురానిది… మరువలేనిది… శ్రీగౌరీదేవిని స్తూతిస్తూ భానుమతి పాడిన గానం కూడా సంగీతప్రియులను మురిపించింది… భానుమతి ఆలాపనతోనే అందరినీ ఆకట్టుకొన్న సందర్భాలు బోలెడు ఉన్నాయి… ఆమెతో కలసి గానం చేయడానికి ఆ నాటి మేటి గాయనీమణులు సైతం జంకేవారు… అయితే ప్రతిభావంతులను ఆమె ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉండేవారు… సినిమాలో బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన భానుమతి రచయిత్రిగానూ ఎంతగానో అలరించారు… ఆ ముచ్చటలన్నీ భానుమతి అభిమానుల మదిలో ఈ నాటికీ పదిలంగానే ఉన్నాయి…

తెలుగు చిత్ర‌సీమ‌లోనే కాదు యావ‌ద్భార‌తంలోనే భానుమ‌తి వంటి బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అయిన న‌టి మ‌రొక‌రు కాన‌రారు…. చిత్ర‌సీమ‌లో ఆమె ఖ్యాతి నిరంతరం వెలుగులు పంచుతూనే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు… భానుమతి మన తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం…