AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..

Theatres

Theatres

AP Theatres Crisis: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో నిర్వహించిన ఫోరం సమావేశంలో థియేటర్ల సమస్యలు, లైసెన్స్‌ విధానం, విద్యుత్‌ ఛార్జీలు, టికెట్‌ ధరలు, OTT విడుదలలపై పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

2 వేల నుంచి 1200కు థియేటర్లు

ఫోరం సమావేశంలో సీనియర్ ఎగ్జిబిటర్ యలమంచిలి రామచంద్రరావు మాట్లాడుతూ.. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 2 వేలకుపైగా సినిమా థియేటర్లు ఉండేవని, ప్రస్తుతం ఆ సంఖ్య సుమారు 1200కు పడిపోయిందని తెలిపారు. ముఖ్యంగా గత 3-4 నెలల్లోనే సుమారు 400 థియేటర్లు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ల నిర్వహణకు సంబంధించిన ఫైర్, సినిమాటోగ్రాఫ్ తదితర వివిధ శాఖల లైసెన్సుల గడువులు వేర్వేరుగా ఉండటంతో ఎగ్జిబిటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అన్ని శాఖలకు ఒకే విధంగా ఐదేళ్ల కాలపరిమితితో సింగిల్ విండో విధానంలో లైసెన్స్‌ రెన్యూవల్స్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

థియేటర్లకు ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్

టూరిజం, హోటల్ రంగాలకు వర్తింపజేస్తున్న విధంగానే సినిమా రంగానికి, థియేటర్లకు కూడా ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ వర్తింపజేయాలని ఎగ్జిబిటర్లు ప్రభుత్వాన్ని కోరారు. పెరుగుతున్న సిబ్బంది జీతాలు, విద్యుత్ ఛార్జీలు, థియేటర్ల ఆధునీకరణ, నిర్వహణ ఖర్చులు తమపై తీవ్ర భారంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో థియేటర్ల నిర్వహణ ఛార్జీలను కొంతమేర పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనే తేడా లేకుండా అన్ని కేటగిరీల థియేటర్లకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా యూనిఫామ్ టికెట్ ధరల విధానాన్ని సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.

OTT విడుదలపై 8 వారాల నిబంధన

కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం 8 వారాలు పూర్తయ్యే వరకు OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయకుండా నిబంధన తీసుకురావాలని ఎగ్జిబిటర్లు.. నిర్మాతలు, ప్రభుత్వాన్ని కోరారు. థియేటర్ల మనుగడ కోసం ఈ నిబంధన ఎంతో అవసరమని పేర్కొన్నారు.

టికెట్ ధరలు పెంచితే ప్రేక్షకులు దూరం

ఏపీ ఎగ్జిబిటర్స్ ఫోరం జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ.. టికెట్ ధరలు పెంచడం వల్ల ముఖ్యంగా మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ ప్రేక్షకులు థియేటర్లకు రావడం పూర్తిగా మానేస్తున్నారని తెలిపారు. టికెట్ రేట్లు పెంచకుండా విడుదలైన ‘ఇరుముడి’, సమంత చిత్రం, ‘డీసీ’ వంటి సినిమాలకు భారీగా రెవెన్యూ వచ్చిందని ఉదాహరణగా పేర్కొన్నారు. టికెట్ ధరలు పెంచడం వల్ల థియేటర్ల మనుగడ మరింత కష్టమవుతుందని, ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపునకు సంబంధించిన జీవోలు ఇవ్వవద్దని కోరారు. టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయం ప్రధానంగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు వెళ్తుందని, థియేటర్ యాజమాన్యాలకు మాత్రం అదనపు ప్రయోజనం దక్కడం లేదని వివరించారు.

మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగాయి

అధిక టికెట్ ధరల కారణంగా సామాన్య ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యాలను తప్పుపడుతున్నారని ఎగ్జిబిటర్లు తెలిపారు. మరోవైపు కరెంట్ బిల్లులు, టాయిలెట్ల నిర్వహణ, సీటింగ్, ఇతర మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. పెరిగిన నిర్వహణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరలను కాకుండా కేవలం థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జీలను మాత్రమే పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. థియేటర్ల మనుగడను కాపాడేందుకు ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి, తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం విజ్ఞప్తి చేసింది.