మేగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’ ఫ్రాంచైజ్ కింద వెబ్ సీరిస్ కూడా తీయాలని గతంలోనే ఆర్కా మీడియా, ఎస్.ఎస్. రాజమౌళి భావించారు. అందులో భాగంగానే నెట్ ఫ్లిక్స్ తో కలిసి దేవా కట్టా, ప్రవీణ్ సత్తారుతో ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో వెబ్ సీరిస్ తీశారు. అయితే… కారణాలు ఏవైనా… నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇంతవరకూ చిత్రీకరించిన ఎపిసోడ్స్ పై అసంతృప్తి వ్యక్తం చేసిందట. ఈ ఇద్దరు తెలుగు దర్శకులు సైతం తమ కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయారు. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల్లోనూ ఎవరెవరు కొనసాగుతారో, ఎవరు మారతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడీ వెబ్ సీరిస్ కు మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మాహిష్మతి సామ్రాజ్యాన్ని శివగామి ఎలా చేజిక్కించుకుందనే అంశం ప్రధానంగా తెరకెక్కుతున్న ఎనిమిది ఎపిసోడ్స్ వెబ్ సీరిస్ లో రమ్యకృష్ణ పాత్రను మృణాల్ ఠాకూర్ పోషించింది. కానీ ఇప్పుడు రీషూట్స్ కు, ప్యాచ్ వర్క్ పూర్తి చేయడానికి ఆమె ససేమిరా అంటోందని తెలుస్తోంది. తెలుగులో వైజయంతి మూవీస్ సంస్థ దుల్కర్ సల్మాన్ తో నిర్మిస్తున్న చిత్రంలో మృణాల్ నాయికగా నటిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది. అలానే హిందీ ‘జర్సీ’లోనూ మృణాలే నాయికగా నటించింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. మరికొన్ని ఇతర చిత్రాలకూ కమిట్ అయిన మృణాల్ అవసరం అయితే… ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ వెబ్ సీరీస్ నుండి తప్పుకుంటాననీ చెబుతోందట. మరి ఈ సమస్యలన్నీ పరిష్కృతమై ఈ వెబ్ సీరిస్ ఎప్పటికి నెట్ ఫ్లిక్స్ లో దర్శనమిస్తుందో చూడాలి.
‘బాహుబలి’ వెబ్ సీరిస్ కు కొత్త కష్టాలు!
