Ananya Panday: బాలీవుడ్ స్టార్ కిడ్, హీరోయిన్ అనన్య పాండే కెరీర్ ప్రస్తుతం ఆశించిన స్థాయిలో సాగడం లేదనే టాక్ వినిపిస్తోంది. సినిమాల పరంగా సరైన హిట్ లేకపోవడంతో పాటు.. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అనన్య తన లవర్ వాకర్ బ్లాంకోతో విడిపోయినట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో 2019లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్య.. ఆ తర్వాత ‘పతి పత్నీ ఔర్ వో’, ‘లైగర్’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కెరీర్‌లో చెప్పుకోదగ్గ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. ‘డ్రీమ్ గర్ల్ 2’ తర్వాత ఆమెకు మరో పెద్ద హిట్ దక్కలేదనే చర్చ సాగుతోంది. ఇటీవల విడుదలైన ‘చాంద్ మేరా దిల్’లోనూ ఆమె నటనపై మిశ్రమ స్పందన వచ్చింది.
ఇక సినిమాలతో పాటు అనన్య పాండే వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో కొంతకాలం డేటింగ్ చేసిన ఆమె.. ఆ తర్వాత అతడితో విడిపోయారు. అనంతరం వాకర్ బ్లాంకోతో అనన్య సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను పెద్దగా దాచిపెట్టలేదని అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. సోషల్ మీడియాలో ఒకరినొకరు పుట్టినరోజు సందర్భంగా విష్ చేసుకోవడం, వాకర్ పేరుతో అనన్య పెండెంట్ ధరించడం వంటి విషయాలు వారి మధ్య బంధంపై ఆసక్తిని పెంచాయి. దాదాపు రెండేళ్లుగా వీరి రిలేషన్‌షిప్ కొనసాగినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ ప్రేమజంట విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. పరస్పర అంగీకారంతోనే అనన్య, వాకర్ విడిపోయారని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ బ్రేకప్‌పై అనన్య పాండే లేదా వాకర్ బ్లాంకో నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం అనన్య పాండే చేతిలో పెద్దగా సినిమాలు లేవని సమాచారం. మరోవైపు ‘కాల్మీ బే 2’ వెబ్ సిరీస్‌లో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కెరీర్‌లో మరోసారి బలమైన కమ్‌బ్యాక్ కోసం అనన్య ఎదురుచూస్తున్నారనే చర్చ జరుగుతోంది. అయితే కొత్త సినిమాల విషయంలో ఆమె తదుపరి అడుగు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.

