Amitabh Bachchan: ‘మెగాస్టార్’ ఇంటిపై కాల్పులకు కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!

Amitabh Bachchan House Firing Plot

Amitabh Bachchan House Firing Plot

Amitabh Bachchan House Firing Plot: బాలీవుడ్ దిగ్గజ నటుడు, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముంబై నివాసం వెలుపల కాల్పులకు కుట్ర జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. విదేశాల్లో ఉంటున్న ఓ గ్యాంగ్‌స్టర్ ఆదేశాల మేరకు ఇద్దరు షూటర్లు ఈ దాడికి ప్రణాళిక రచించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కుట్రను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ విభాగం భగ్నం చేసింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను ఢిల్లీ, ముంబైలో వేర్వేరు ఆపరేషన్లలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల విచారణలో అమితాబ్ ఇంటి వెలుపల కాల్పులు జరిపి.. భయభ్రాంతులకు గురి చేయాలని పథకం రచించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

జలంధర్‌కు చెందిన వికాస్ ఠాకూర్ అలియాస్ విక్కీ (25), పంజాబ్‌లోని తరన్‌తారన్‌కు చెందిన దీపక్ సింగ్ అలియాస్ దీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ విదేశాల్లో ఉంటున్న ఓ గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోని ఓ వ్యాపారవేత్తను లక్ష్యంగా చేసుకుని బెదిరింపుల ద్వారా డబ్బు వసూలు చేసేందుకు కాల్పులు జరపాలని వికాస్‌కు ఆదేశాలు అందాయి. ఇందుకోసం వికాస్ ముంబై నుంచి ఢిల్లీకి చేరుకుని వ్యాపారవేత్తపై దాడికి సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దీప్ కోసం గాలింపు చేపట్టి ముంబైలో అరెస్ట్ చేశారు. దీప్‌ను విచారించగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైలోనే ఎక్కువ కాలం ఉండాలని.. ప్రముఖ బాలీవుడ్ నటుడి నివాసం వద్ద కాల్పులు జరపాలని విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్లు అతడికి సూచించారు.

ఆ నటుడు అమితాబ్ బచ్చన్ అని పోలీసు వర్గాలు గుర్తించాయి. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి అమితాబ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను లక్ష్యంగా చేసుకోవాలని గ్యాంగ్‌స్టర్ భావించినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని అమితాబ్ గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద కాల్పులకు కుట్ర జరిగినట్లు వెల్లడవడం కలకలం రేపుతోంది. అరెస్టయిన దీప్‌పై అమృత్‌సర్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మాడ్ సంధు హత్య కేసులోనూ ఆరోపణలు ఉన్నాయి. అక్టోబర్ 3న జరిగిన ఈ హత్యలో దీప్‌తో పాటు మరో వ్యక్తి పాల్విందర్ అలియాస్ కాకా పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాల్విందర్‌ను ఇప్పటికే పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాడ్ సంధు హత్య అనంతరం దీప్ ముంబైలో తలదాచుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

వికాస్ గతంలో స్నాచింగ్, అక్రమ బెట్టింగ్ వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. 2023లో గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌కు అక్రమ ఆయుధాలు సరఫరా చేయడం ప్రారంభించాడని ఆరోపించారు. ఆ తర్వాత ఇతర గ్యాంగ్‌స్టర్లతోనూ సంబంధాలు ఏర్పరచుకుని ఆయుధాల సమీకరణ, కొత్త సభ్యుల నియామకం, వసూళ్ల కోసం దాడులకు ముందు రెక్కీ నిర్వహించడం వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ నర్రా చైతన్య వెల్లడించారు. మరో నిందితుడు దీప్ గతంలో ట్రక్ హెల్పర్‌గా, డ్రైవర్‌గా పనిచేసేవాడని.. స్థానిక గ్యాంగ్ సభ్యుల ద్వారా నేర ప్రపంచంలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. అమితాబ్ బచ్చన్ నివాసం వద్ద కాల్పుల కుట్ర, ఇతర నేరాలతో నిందితులకు ఉన్న సంబంధాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.