తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందే ఉంటుంది. సైలెంట్ సినిమాల నుంచి టాకీల వరకు, గ్రాఫిక్స్ నుంచి విజువల్ వండర్స్ వరకు టాలీవుడ్ ఎన్నో మైలురాళ్లను చూసింది. ఇప్పుడు అదే బాటలో సరికొత్త సాంకేతిక విప్లవానికి తెర లేపుతూ.. టాలీవుడ్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ఒక పూర్తి స్థాయి AI ఫీచర్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే— ‘అంబ’s రివెంజ్’. మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన, పగతో రగిలిపోయే ‘అంబ’ పాత్ర స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ పురాణ గాథను నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా మారుస్తూ, అత్యాధునిక ఏఐ టెక్నాలజీని జోడించి సరికొత్త మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో ఈ సినిమాను రూపొందించడం విశేషం.
ఈ వినూత్న చిత్రాన్ని ‘నక్క తోక ఫిలిమ్స్’ బ్యానర్‌పై నిర్మాతలు యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జయవర్ధన్ మడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమయ్యారు. సినిమాకు అత్యంత కీలకమైన విజువల్స్, క్యారెక్టర్ డిజైనింగ్ బాధ్యతలను ‘కాలై విజువల్ స్టూడియోస్’ సంస్థ ఏఐ విజువల్ డిజైన్ & డెవలప్‌మెంట్ రూపంలో అద్భుతంగా హ్యాండిల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సర్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే చిత్ర బృందం అధికారికంగా ప్రచార పర్వాన్ని ప్రారంభించింది. తాజాగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

