Allu Aravind 1 Crore Challenge: ఆ సినిమా విషయంలో సుకుమార్‌‌కి అల్లు అరవింద్ రూ.కోటి ఛాలెంజ్‌… వైరల్ అవుతున్న చెక్!

Allu Aravind Sukumar Aakasamlo Oka Tara Viral Cheque

Allu Aravind Sukumar Aakasamlo Oka Tara Viral Cheque

Allu Aravind 1 Crore Challenge: టాలీవుడ్‌లో ఏదైనా సినిమా బాగుంటే, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రమోషన్ స్టైల్ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించిన ‘ఆకాశంలో ఒక తార’ (AOT) సినిమా విషయంలో ఇప్పుడు అలాంటిదే ఒక క్రేజీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా థియేటర్ నుంచి బయటకొస్తే ఏకంగా రూ. కోటి ఇస్తానని అగ్ర నిర్మాత అల్లు అరవింద్, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌కు ఛాలెంజ్ విసిరినట్లు ఒక పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఆ పందెంలో ఓడిపోయిన సుకుమార్ రూ. లక్ష చెక్ రాసిచ్చిన ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

సుకుమార్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పేరుతో వైరల్ అవుతున్న ఆ పోస్ట్ ప్రకారం.. ముందు రోజు అల్లు అరవింద్ నుంచి సుకుమార్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమయంలో అరవింద్ ఒక ఇంట్రెస్టింగ్ పందెం కాశారట. “హే సుకుమార్.. వెళ్లి ‘ఆకాశంలో ఒక తార’ (AOT) సినిమా చూడు. కన్నీళ్లు రాకుండా థియేటర్ నుంచి బయటకు వస్తే నీకు రూ. కోటి ఇస్తాను. ఒకవేళ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం నువ్వే నాకు రూ. లక్ష ఇవ్వాలి” అని ఛాలెంజ్ విసిరారట.

సినిమా చూసిన తర్వాత సుకుమార్ తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయారని, దీంతో పందెంలో ఓడిపోయి అల్లు అరవింద్ పేరు మీద ‘వన్ ల్యాక్ రూపీస్ ఓన్లీ’ అంటూ యాక్సిస్ బ్యాంక్ చెక్ రాసిచ్చినట్లు ఆ వైరల్ పోస్ట్‌లో కనిపిస్తోంది. ఈ సినిమాలోని ఎమోషన్ ఏ స్థాయిలో కనెక్ట్ అయిందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఏముంటుందని నెటిజన్లు ఈ చెక్ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయమైన ఈ చిత్రంలో శృతి హాసన్, రుహానీ శర్మ కీలక పాత్రల్లో నటించగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. థియేటర్లలో మంచి టాక్‌తో నడుస్తున్న ఈ సినిమాకు అల్లు అరవింద్, సుకుమార్‌ల ఈ సరదా ఛాలెంజ్ పోస్ట్ మరింత హైప్ తీసుకొస్తోంది.