హిట్ ఫట్ తో సంబంధం లేకుండా బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో ధూసుకుపోతున్న స్టార్ హీరో అక్షయ్ కుమార్. అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉంటూ ఏడాదికి రెండు సినిమా లైనా తీస్తున్నారు. అలా ఎప్పుడూ యాక్షన్ సినిమాలతో, బిజీ షెడ్యూల్‌తో ఉండే ఈ నటుడు ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో తన జీవన తత్వం గురించి పంచుకున్నారు. జీవితంలో డబ్బు, పేరు, విజయానికి మించింది మనశ్శాంతి అని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అన్నారు.
Also Read : Balasaraswathi: గాన పితామహి బాలసరస్వతి ఇక లేరు..
“మనిషికి డబ్బు అవసరమే. కానీ మనశ్శాంతి దానికంటే ఎంతో గొప్పది. నేను నా జీవితంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఎన్ని సినిమాలు చేస్తున్నా, ఎన్ని సక్సెస్‌లు సాధించినా మనశాంతి లేకపోతే ఆ విజయాలకు అర్థం ఉండదు” అని అక్షయ్ తెలిపారు. ఇంతలోనే ఓ విలేకరి “మీ కుమార్తె నితారకు డబ్బు ప్రాముఖ్యత నేర్పిస్తారా?” అని అడగగా, అక్షయ్ సింపుల్‌గా..
“డబ్బు విలువ ఎవరికి వారు జీవితం ద్వారా నేర్చుకుంటారు. అది ఎవరో చెప్పడం ద్వారా కాదు, అనుభవం ద్వారా వస్తుంది. మనం అందరం పని చేయడం, కష్టపడడం వెనుక కారణం డబ్బే. కానీ అది మనశ్శాంతిని మింగేస్తే, ఆ డబ్బు విలువే ఉండదు” అని చెప్పారు. “డబ్బు లేదా మనశ్శాంతి ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోమంటే, నేను మనశ్శాంతినే ఎంచుకుంటాను” అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇక సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ త్వరలో తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇక ఆయన నటించిన తాజా చిత్రం ‘భూత్ బంగ్లా’ విడుదలకు సిద్ధంగా ఉంది.
