నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘అఖండ-2’ చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమా టికెట్ల విక్రయానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా తెలంగాణలో టికెట్ రేట్లు పెంచి అమ్ముతున్నారంటూ ఒక వ్యక్తి వేసిన పిటీషన్ హైకోర్టు విచారించి ఇది సరికాదని చెబుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోని సస్పెండ్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా ‘అఖండ-2’ టికెట్ల విక్రయాలపై తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ ఉత్తర్వులు సినిమా విడుదల ప్రక్రియకు ఉపశమనం కలిగించాయి.
Also Read:Akhanda 2: కోర్టు ఉత్తర్వులు అంటే లెక్క లేదా? అఖండ 2 టికెట్ల అమ్మకాలపై హైకోర్టు సీరియస్
అయితే, అంతకు ముందు సినిమా నిర్మాతలు హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించడంపై సింగిల్ జడ్జ్ తీవ్రంగా స్పందించారు. “కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా?” అని నిర్మాతల తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. ఆన్‌లైన్ టికెట్ విక్రయాల సంస్థ ‘బుక్ మై షో’ను కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఉత్తర్వులు అందే లోపు ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని బుక్ మై షో కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు, “ఇప్పుడు పెంచిన రేట్లతో ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారా? లేదా? మీపై ఎందుకు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకూడదో చెప్పండి” అంటూ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తాజా డివిజన్ బెంచ్ స్టే ఉన్నప్పటికీ, ఈ కోర్టు ధిక్కరణ చర్యలపై స్పందించాల్సిన పరిస్థితి నిర్మాతలకు, బుక్ మై షోకు ఎదురైంది. ఈ వివాదం సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
