NTV Telugu Site icon

వనతి శ్రీనివాసన్ ను ప్రశ్నిస్తున్న అజిత్ ఫ్యాన్స్!

Ajith Kumar Fans Questioned Vanathi Srinivasan

వనతి శ్రీనివాసన్… ఇప్పుడు తమిళనాడులో బాగా వినిపిస్తున్న పేరు. లోక నాయకుడు కమల్ హాసన్ ను ఓడించిన బీజేపీ అభ్యర్థి ఆమె! కోయంబత్తూర్ సౌత్ నుండి పోటీ చేసిన కమల్ ఓడిపోవడమే కాకుండా, అతని ఎం.ఎన్.ఎమ్. పార్టీ నుండి పోటీ చేసిన మరే అభ్యర్థీ తమిళనాట విజయం సాధించలేదు. విశేషం ఏమంటే… అన్నాడీఎంకే సహకారంతో బరిలోకి దిగిన వనతి శ్రీనివాసన్ ఎన్నికల ప్రచార వేళ అజిత్ ఫ్యాన్స్ కు ఓ హామీ ఇచ్చిందట. అజిత్ ఫ్యాన్స్ తనకు ఓటు వేస్తే… అతని తాజా చిత్రం ‘వాలిమై’కు సంబంధించిన అప్ డేట్స్ ఇచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పిందట. తమిళనాడు మాజీ సీయం, స్వర్గీయ జయలలిత అంటే అజిత్ కు ఎంతో అభిమానం. అలానే అతని ఫ్యాన్స్ లోనూ చాలా మంది జయలలిత అభిమానులు ఉన్నారు. వారంత ఇప్పుడు బీజేపీ నుండి బరిలో దిగిన వనతి శ్రీనివాసన్ కే ఓటు వేసి ఉంటారు. ఆమె ఎన్నికల్లో గెలిచీ గెలవగానే ప్రధాని నరేంద్రమోదీకి, అమిత్‌ షాకు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ కూ, కార్యకర్తలకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపింది. ఇదే అదనుగా ఆ ట్వీట్టర్ కిందే అజిత్ అభిమానులంతా… ఆమెకు అభినందనలు తెలియచేస్తూనే, ఆమె తమకు ఇచ్చిన హామీ గురించి ప్రశ్నిస్తున్నారు. ‘అక్కా… మా అజిత్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇస్తానన్నావు… ఆ విషయం ఏమైంది?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాదు.. మీమ్స్ తో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు కూడా! మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వనతి శ్రీనివాసన్… అజిత్ తో మాట్లాడి ‘వాలిమై’కు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ ఇస్తుందేమో చూడాలి!!