Site icon NTV Telugu

Aishwarya Rai : తన మార్ఫింగ్‌, ఏఐ వీడియోలపై.. కోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యరాయ్

Aishwarya Rai

Aishwarya Rai

ప్రపంచ అందాల రాణి, బాలీవుడ్ అగ్రనటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, ఇమేజ్‌లను వాడకుండా తక్షణ ఆదేశాలు ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

Also Read : The Bads of Bollywood : ఆర్యన్ ఖాన్ తొలి వెబ్ సిరీస్.. ట్రైల‌ర్‌లో ఏంట్రీ ఇచ్చిన రాజ‌మౌళి

ఐశ్వర్య తరఫు న్యాయవాది సందీప్ సేథి కోర్టుకు వివరాలు అందజేశారు. కొంతమంది వ్యక్తులు, సంస్థలు ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, కృత్రిమ మేధస్సు (AI) తో ఎడిట్ చేసి, అసభ్యకరమైన వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారని చెప్పారు. అంతేకాకుండా ఆమె ఫొటోలను టీ షర్ట్‌లపై ముద్రించి వ్యాపారం కూడా చేస్తున్నారు. అనుమతి లేకుండా ఎవరూ ఇలా చేయలేరని, ఇది ప్రైవసీ హక్కుల ఉల్లంఘన అని వాదించారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు 2026 జనవరి 15కి వాయిదా వేసింది.

ఇక ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ గురించి వచ్చిన తప్పుడు ప్రచారాలపై కోర్టును ఆశ్రయించారు. ఆమె అనారోగ్యంతో ఉందని, “ఇక లేరు” అంటూ కొందరు యూట్యూబ్ ఛానళ్లలో నకిలీ వార్తలు రావడంతో ఆ సమయంలో కూడా ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పిల్లల ఆరోగ్యం, ప్రైవసీ వంటి విషయాల్లో తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చేయడాన్ని కోర్టు ఖండిస్తూ సంబంధిత కంటెంట్ తొలగించమని ఆదేశించింది. ఐశ్వర్య తాజా పిటిషన్‌ మరోసారి సెలబ్రిటీల ప్రైవసీ, ఇమేజ్ హక్కుల రక్షణపై చర్చకు దారితీసింది. అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు వాడితే కఠిన చర్యలు తప్పవని కోర్టు సూచించడంతో, సినీ ప్రముఖుల హక్కుల పరిరక్షణకు ఇది ఒక ప్రాముఖ్యమైన నిర్ణయంగా భావిస్తున్నారు.

Exit mobile version